ఇమ్రాన్‌ఖాన్‌పై అనర్హత వేటు !

Telugu Lo Computer
0


పాకిస్తాన్ మాజీ ప్రధాని, ప్రతిపక్ష పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌కు తోషాఖానా కేసులో పాకిస్తాన్ ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. కానుకల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయ వివరాలను దాచిపెట్టిన కేసులో ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఫలితంగా ఇమ్రాన్‌ఖాన్‌ ఐదేళ్లపాటు ఆయన పార్లమెంట్‌ సభ్యుడు అయ్యేందుకు వీలు లేకుండా పోయింది. ఇమ్రాన్ ఖాన్‌ పాక్‌ ప్రధానిగా ఉండగా, ఇతర దేశాల అధినేతలు, ప్రతినిధులు ఇచ్చిన కానుకలను ఇమ్రాన్‌ ఖాన్‌ పాకిస్తాన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘తోషాఖానా’ నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. వాటిని విక్రయించడం ద్వారా ఎంత వచ్చిందనే వివరాల్ని ఆయన బయటపెట్టలేదని ఆరోపిస్తూ కొందరు పాకిస్తాన్‌ చట్ట సభ్యులు ఆ దేశ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇమ్రాన్‌ను అనర్హునిగా ప్రకటించాలని కోరారు. ఈ నేపథ్యంలో దీనిపై ఐదుగురు సభ్యుల కమిటీ విచారణ చేపట్టింది. వాటిలో లగ్జరీ వాచీలు, ఆభరణాలు, డిజైనర్ హ్యాండ్‌బ్యాగ్‌లు, పెర్ఫ్యూమ్‌లు ఉన్నాయని, కొన్ని బహుమతులు లేదా వాటిని విక్రయించడం ద్వారా వచ్చిన లాభాన్ని ప్రకటించడంలో ఖాన్ ఇన్​కమ్ ట్యాక్స్​ రిటర్నుల్లో చూపలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇమ్రాన్‌పై అనర్హత వేటు వేసింది. పలు కానుకల్ని రూ.2 కోట్ల 15 లక్షల 60వేలకు తోషాఖానా నుంచి కొనుగోలు చేసినట్లు పాక్ ఎన్నికల సంఘానికి విచారణ సమయంలో ఇమ్రాన్‌ఖాన్‌ తెలిపారు. వాటిని విక్రయిస్తే రూ.5కోట్ల 80లక్షలు వచ్చినట్లు సమాచారం. అవినీతి నిరోధక చట్టం కింద ఆయనపై చర్యలు తీసుకుంటామని ఈసీ వెల్లడించింది. ఎన్నికల సంఘం నిర్ణయం వల్ల ఇమ్రాన్‌ పార్లమెంట్‌ నుంచి ఐదేళ్ల పాటు అనర్హత వేటుకు గురయ్యారుయ ఐదేళ్ల వరకు పార్లమెంట్‌ ఎన్నికకు ఆయన అనర్హుడు. అయిదేళ్ల నిషేధం పూర్తి అయ్యే వరకు పాక్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 63 (1) (p) ప్రకారం పార్లమెంట్‌కు కానీ, అసెంబ్లీకి కానీ ఇమ్రాన్‌ పోటీ చేయరాదు. ఒకవేళ ఎన్నికైనా, లేదా ఎంపికైనా దానికి అర్హత ఉండదు. ఎన్నికల సంఘం ఇచ్చిన తీర్పును ఇమ్రాన్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఇన్సాఫ్‌ ఖండించింది. ఇమ్రాన్‌ను ఎవరూ అనర్హుడిగా ప్రకటించలేరని, కేవలం ప్రజలు మాత్రమే ఆ తీర్పు ఇవ్వగలరని పీటీఐ నేతలు తెలిపారు. తోషాఖానా శాఖను 1974లో ఏర్పాటు చేశారు. విదేశీ నేతలు ఇచ్చే ఖరీదైన బహుమతుల్ని ఆ శాఖ తమ ఆధీనంలో ఉంచుకుంటుంది. ఎవరికి బహుమతులు వచ్చినా ఆ విషయాన్ని కేబినెట్‌కు చెప్పాల్సి ఉంటుంది. కానీ పీటీఐ ప్రభుత్వం హయాంలో ఇమ్రాన్‌కు వచ్చిన బహుమతుల లెక్క తేలలేదు. ప్రధానిగా ఉన్న సమయంలో నాలుగు బహుమతుల్ని అమ్ముకున్నట్లు ఇమ్రాన్‌ కేసు విచారణ సందర్భంగా ఒప్పుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)