యువతకు ఉద్యోగానికి బదులు మందు బాటిళ్లు ఇస్తున్నారు !

Telugu Lo Computer
0


జమ్మూ కశ్మీర్ ప్రభుత్వంపై పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కశ్మీరి యువతకు ఉద్యోగాలకు బదులు మద్యం బాటిళ్లు ఇస్తున్నారని ఆమె విమర్శించారు. లిక్కర్ షాపుల్ని తెరవడాన్ని కశ్మీర్ ఎంత మాత్రం అనుమతించదని, దీనిపై గొంతులు లేచి రాబోయే కాలంలో కశ్మీర్‭లో ఏం జరుగుతుందో చూస్తారని ఆమె అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్‭లో నిరుద్యోగం తారా స్థాయికి చేరిందని, అయితే లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మాత్రం పట్టింపే లేదని మండిపడ్డారు. కశ్మీరి యువతను పూర్తిగా విస్మరిస్తున్నారని, వారిని తప్పుదారి పట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలకు, విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఒక్కటవుతారని, గట్టిగా ప్రతిఘటిస్తారని మెహబూబా ధ్వజమెత్తారు. కశ్మీర్‭లో పెరిగిపోతున్న అవినీతిపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతిని కట్టడి చేయడానికి బదులు చిన్న చిన్న అధికారులను తొలగించి చేతులు దులుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద వ్యక్తులు చేసే అవినీతికి చిన్న వ్యక్తుల మెడపై కత్తి వేలాడుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లోయలోని పర్యావరణాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తున్నారని, ఇక్కడి పరిస్థితుల్ని పూర్తిగా మార్చే పెద్ద కుట్రే జరుగుతోందని మెహబూబా ఆరోపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)