వైసీపీ ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేకుండా చేసింది !

Telugu Lo Computer
0


సీపీఐ 24వ జాతీయ మహాసభలు విజయవాడలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ మహాసభల్లో అమరావతికి మద్దతుగా తీర్మానం ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ కి అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ముప్పాళ్ల నాగేశ్వరరావు తీర్మానాన్ని 29 రాష్ట్రాల ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి సత్వరమే అమరావతి నిర్మాణం కొనసాగించాలని తీర్మానంలో పేర్కొన్నారు. అనంతరం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ 17 దేశాల ప్రతినిధులతో వామపక్ష పార్టీల బలోపేతంపై చర్చించామని తెలిపారు. అమరావతి రాజధానిగా ఉండాలని, మోదీ ఆర్థిక విధానాలపై వ్యతిరేకంగా 24వ జాతీయ మహాసభల్లో తీర్మానాలు చేశామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వెల్లడించారు. ఏపీకి అమరావతి రాజధానిగా ఉండాలని టీడీపీ కంటే తాము ముందుగా ప్రకటించినట్లు గుర్తుచేశారు. ఏపీకి ప్రస్తుతం రాజధాని లేకుండా వైసీపీ ప్రభుత్వం చేసిందని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ రాజధాని ఏదంటే చెప్పలేని స్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారని.. బిడ్డకు మూడేళ్లు వచ్చినా, తల్లి, తండ్రి ఎవరో చెప్పలేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులు అనేది సర్కార్ ఉద్యమం అన్నారు. అధికార పార్టీ నాయకులు భూదోపిడీదారులు అని నారాయణ తీవ్రంగా ఆరోపించారు. కాగా ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని సీపీఐ నేత రామకృష్ణ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీలను చూస్తే సీఎం జగన్‌కు ఎందుకంత భయం అని ప్రశ్నించారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ విశాఖ గర్జన పూర్తిగా విఫలమైందని.. అందుకే వైసీపీ నేతలు ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారని చురకలు అంటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)