భారత్‌ జోడో యాత్రలో అపశ్రుతి !

Telugu Lo Computer
0


రాహుల్‌ గాంధీ పాదయాత్ర ప్రస్తుతం కర్ణాటకలోని బళ్లారి జిల్లా న్యూమోకా గ్రామంలో కొనసాగుతుండగా, ఈ యాత్రలో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు స్తంభానికి జెండాలు కడుతుండగా ఐదుగురు కరెంట్‌ షాక్‌కు గురయ్యారు. ఆ ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఆ ఐదుగురిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలాలు పరామర్శించారు. ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ ప్రమాదం గురించి రాహల్ గాంధీ తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ద్వారా తెలియజేశారు. ఈ ఘటన దురదృష్టకరమని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని చెప్పారు. వారికి పెద్ద గాయాలు తగిలాయని ఆయన తెలిపారు. జోడో యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని రాహుల్‌గాంధీ సూచించారు. వారు వెంటనే కోలుకునేలా చర్యలు తీసుకోవాలని నేతలకు సూచించారు. వారంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే నాగేంద్ర వెంటనే క్షతగాత్రులను మోకా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రాహుల్ గాంధీకి సమీపంలోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. రాహుల్ గాంధీ వెంట ఉన్న భద్రతా బృందం ఆయనకు రక్షణ కల్పించింది. రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న ఈ యాత్ర 1000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది. సెప్టెంబర్‌ 7న ప్రారంభమైన భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు 3,500 కిమీల దూరం లక్ష్యంతో 12 రాష్ట్రాల మీదుగా కొనసాగుతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)