హిజాబ్‌పై గర్జిస్తున్న ఇరాన్ మహిళలు !

Telugu Lo Computer
0


ఇరాన్ లో  సెప్టెంబర్ 16న కుర్దిష్ మహిళ మహసా అమీని మృతితో మొదలైన నిరసలు తీవ్రరూపం దాల్చాయి. దీంతో శనివారం ఇరాన్ లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. అమీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తీవ్రంగా కొట్టి, హింసించడం వల్లే చనిపోయిందంటూ ప్రజలు రోడ్డెక్కారు. హిజాబ్ సరిగా ధరించలేదనే కారణంతో మోరాలిటీ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. కస్టడీలోకి తీసుకున్న మూడు రోజుల తర్వాత ఆమె మరణించడంతో దేశ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. హిజాబ్‌ను కాలుస్తూ.. మహిళలు తమ జట్టు కత్తిరించుకుని వినూత్న రీతితో నిరసనలు తెలుపుతున్నారు. పశ్చిమ్ టెహ్రాన్‌ హమేదాన్ నగరంలోని ప్రముఖ ప్రాంతం రౌండ్‌అబౌట్ సమీపంలో అనేకమంది నిరసనకారులు చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తూ భద్రతా దళాలపై తమ చేతుల్లో ఉన్న వస్తువులను విసిరారు. వాయువ్య ఇరాన్ నగరం అర్దబిల్‌లోనూ నిరసనలు మిన్నంటాయి. కుర్దిష్ ప్రావిన్సుల్లోని అమీనీ సొంత పట్టణం సఖేజ్‌లోనూ దుకాణుదారులు తమ షాపులను మూసివేసి బంద్ పాటించారు. వీధి ప్రదర్శనల్లో యువతులు ముందు వరుసలో ఉండటం గమనార్హం. 'మతపెద్దల్లారా (ముల్లాహ్) ఇక్కడి నుంచి వెళ్లిపోండి' అని నినదిస్తున్నారు. ''తుపాకులు, ట్యాంకులు, బాణా సంచా.. ముల్లాహ్‌లు తప్పుకోవాలి'' అంటూ టెహ్రాన్‌లోని షరియతి టెక్నికల్ అండ్ ఒకేషనల్ కాలేజ్ వద్ద హిజాబ్ ధరించకుండా అమ్మాయిలు చేస్తున్న నిరసన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)