నూడుల్స్ తిని బతకాల్సి వస్తోంది !

Telugu Lo Computer
0


బ్రిటన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని, పెరిగిన ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే వార్తలు కూడా మీడియాలో కనిపిస్తున్నాయి. దీనికి తోడు బ్రిటన్ ప్రధాన మంత్రులు తరచూ మారుతున్నారు. నిన్నకాక మొన్న అధికారం చేపట్టిన లిజ్ ట్రస్ రెండు నెలలు కాక మునుపే  రాజీనామా చేశారు. లిజ్ ట్రస్ తరువాత బ్రిటన్ ప్రధాని పగ్గాలు ఎవరు చేపడతారు? ప్రస్తుత ఆర్థిక, రాజకీయ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారు? అనే అంశాల మీద మీడియాలో చర్చలు నడుస్తున్న తరుణంలోనే పెరుగుతున్న ధరలతో  ప్రజలు అల్లాడుతున్నారు. మాండీ డోక్స్ వంటి వారు ఈ మధ్య ఎక్కువగా నూడుల్స్ మాత్రమే తింటున్నారు. అవంటే ఆ యువతికి ఇష్టమని కాదు, ఇతర ఫుడ్ ఐటమ్స్ కొనే స్థోమత లేక. నార్విచ్‌కు చెందిన రెబెక్కా కెల్లావే పెరుగుతున్న ఖర్చులను తట్టుకునేందుకు అయిదు ఉద్యోగాలు చేస్తున్నారు. కరెంటు బిల్లుకు భయపడి, చలికి హీటర్ వేసుకోవడం కూడా మానేశారు గెయిన్స్‌బరోకు చెందిన నికోలీ. అంతేకాదు ఆహార పదార్థాలు ఎక్కడ తక్కువ రేటుకు దొరుకుతాయా అని నాలుగైదు మార్కెట్లు తిరిగి కొంటున్నారు. రేపటి కోసం పొదుపు చేసుకున్న సేవింగ్స్ నుంచి డబ్బులు బయటకు తీస్తున్నారు. ఇంట్లో వాళ్లు, తెలిసిన వాళ్ల నుంచి చేబదులు తీసుకుంటున్నారు. బ్యాంకులను లోన్లు అడుగుతున్నారు. చివరకు కొందరు తిండి కోసం ప్రభుత్వం నడిపే ఫుడ్ బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. మారుతున్న వీరి జీవన పరిస్థితులు బ్రిటన్ ఆర్థికవ్యవస్థ ఇబ్బందుల్లో ఉందనేందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌లోని మిల్టన్ కీన్స్ అనే కౌన్సిల్ ఏకంగా ఎమర్జెన్సీ విధించింది. ప్రజలు విద్యుత్, గ్యాస్, పెట్రోలు వంటి ఖర్చులు చెల్లించలేక పోవడంతో 'కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎమర్జెన్సీ' విధిస్తున్నట్లు కౌన్సిల్ ప్రకటించింది. బ్రిటన్‌లో ధరలు పెరిగిపోతున్నాయి. ద్రవ్యోల్బణం సుమారు 10 శాతానికి చేరింది. ఇది 40 ఏళ్ల గరిష్టం. ఇది ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)