తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ !

Telugu Lo Computer
0


తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దసరా సెలవుల నేపథ్యంలో స్వామివారి దర్శనార్థం భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తుల రద్దీతో అన్ని కంపార్ట్‌మెంట్లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. దీంతో శ్రీవారి దర్శనానికి 48 గంటలు సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. క్యూలైన్లు శిలా తోరణం వద్దకు చేరుకున్నాయి. పెరటాసి మాసం మూడవ శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిందని అధికారులు అంటున్నారు. అక్టోబర్ 4 వరకు సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ అక్టోబర్ 5 మధ్యాహ్నం నుండి క్రమంగా పెరిగిందన్నారు. పెరటాసి మాసం కావడంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయి కనిపిస్తున్నాయి. నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు నిండి పోవడంతో శిలాతోరణం వరకూ భక్తులుతో 4 కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో సర్వదర్శనానికి 48గంటలకు పైగా సమయం పడుతోంది. తిరుమలకు వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ అధికారులు కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)