ముగిసిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు !

Telugu Lo Computer
0


కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లలో పార్టీ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో సోనియా, మన్మోహన్, ప్రియాంక గాంధీ, ఖర్గే ఓటు వేశారు. దేశ వ్యాప్తంగా 65 పోలింగ్ బూత్ లలో 9వేల మందికిపైగా సభ్యులు ఓటు వేశారు. భారత్ జోడోయాత్రలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలింగ్ బూత్ లో.. క్యూలో నిల్చొని రాహుల్ గాంధీ ఓటు వేశారు. ఆయా రాష్ట్రాలలో రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బ్యాలెట్ బాక్సులను ఇవాళ్టి రాత్రి కల్లా ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయానికి తరలిస్తారు. ఎల్లుండి ఓట్ల లెక్కింపు చేసి.. విజేతను ప్రకటిస్తామని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్ మధుసూధన్ మిస్త్రీ తెలిపారు. అధ్యక్ష పదవిని చేపట్టేందుకు రాహుల్ ఇష్టపడకపోవడంతో 24 ఏండ్ల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. శశిథరూర్, మల్లికార్జున ఖర్గే పోటీలో నిలిచారు. పారదర్శకంగా ఎన్నికలు ఎలా జరిగాయో.. రాబోయే కొత్త నాయకత్వం కూడా అలాగే ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో నిర్ణయాలు ఎలా అమలు చేయాలో కొత్త నాయకత్వం చూసుకుంటుందన్నారు. బహిరంగ, ప్రజాస్వామ్య, పారదర్శక ఎన్నికలు నిర్వహించి కాంగ్రెస్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మరో నేత సచిన్ పైలట్ అన్నారు . అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రజాస్వామ్య ప్రక్రియలో మేమున్నందుకు గర్విస్తున్నామని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ కేవలం కాంగ్రెస్ లోనే ఉందన్నారు. ఇక్కడ రబ్బర్ స్టాంప్ అధ్యక్షుడు ఎవరూ ఉండరన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)