కోట్లాది మంది మెచ్చిన యూట్యూబర్ ఈ ఖాన్ సార్ !

Telugu Lo Computer
0


ఖాన్ సర్ పూర్తి పేరు ఫైసల్ ఖాన్. దేశవ్యాప్తంగా అందరూ ఖాన్ సర్ అని పిలుస్తారు. ఆయన యూపీలోని గోరఖ్‌పూర్‌లో జన్మించారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఖాన్‌ సర్‌కి చిన్నప్పటి నుంచి చదువంటే చాలా ఇష్టం. అలహాబాద్ యూనివర్సిటీలో బీఎస్సీ చదివాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత జాగ్రఫీలో పీజీ చేశారు. చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలనేది అతని కల. అయితే ఫిజికల్‌గా ఫిట్‌మెంట్ లేకపోవడంతో ఆర్మీలో చేరలేకపోయాడు. ఇది ఖాన్ సర్ ను బాగా కుంగదీసింది. అలాంటి పరిస్థితిలో ఖాన్‌ సర్‌ బాధను తగ్గించుకోవడానికి.. తనను తాను బిజీగా ఉంచుకోవడానికి చుట్టూ ఉన్న పిల్లలకు పాఠాలు నేర్పించడం ప్రారంభించాడు. ఇలా ఆయన దగ్గర చదువుకునే పిల్లల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో టీచింగ్‌ని కెరీర్‌గా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇలా ఆలోచించిన ఖాన్ సర్ పాట్నాలో కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించాడు. ఖాన్ సర్ రిసెర్చ్ సెంటర్ గా పిలిచే ఈ కేంద్రానికి వచ్చే పిల్లల సంఖ్య చాలా పెరిగింది. పిల్లల దగ్గర కేవలం 200 రూపాయలు మాత్రమే ఫీజు తీసుకునేవాడు. తన దగ్గరికి వచ్చే విద్యార్థి డబ్బు లేని కారణంగా వెనక్కి వెళ్లిపోకూడదు అనేది ఖాన్ సర్ ఆలోచన. అయితే తన పాఠాలు ఎక్కువమందికి చేరువ కాకపోవడం, అదే విధంగా మిగితా వాళ్లు ఎక్కువగా ఫీజులు వసూలు చేయడం వంటివి ఖాన్ సర్ కు నచ్చలేదు. నిరుపేద పిల్లలు కూడా బాగా చదువుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అలా ఆలోచించి ఏప్రిల్ 2019లో జీఎస్ రీసెర్చ్ సెంటర్ పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించారు. యూట్యూబ్‌లో వీడియోలు చేసే ఇతర వ్యక్తుల కంటే ఖాన్ సర్ బోధనా శైలి చాలా భిన్నంగా ఉంటుంది. చాలా కష్టమైన సబ్జెక్ట్‌లను కూడా నవ్వులు పూయిస్తూ సరదాగా , సులువుగా వివరిస్తారు. ఆయన యూట్యూబ్ వీడియోలను ప్రజలు అమితంగా ఇష్టపడటానికి ఇదే ప్రధాన కారణం. ఖాన్ సర్ పలుమార్లు వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. ఆయన రైల్వే రిక్రూట్‌మెంట్ పరీక్ష ఫలితాలను విశ్లేషిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో రెచ్చగొట్టే విధంగా ఉందని భావించిన పోలీసులు ఆయనపై కేసు కూడా నమోదు చేశారు. ఇదొక్కటే కాదు, పిల్లలను కనడం, పంక్చర్లు వేయడం, పాకిస్థాన్‌లోని ఫ్రెంచ్ రాయబారిని దేశం నుంచి వెళ్లగొట్టడం వంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. ఉపాధ్యాయులందరినీ వెనక్కి నెట్టి ఇండియాలోనే నెంబర్ వన్ యూట్యూబ్ టీచర్గా ఖాన్ సర్ మారారు. ఈరోజు ఖాన్ సర్‌కి ఉన్న పాపులారిటీ ఎంతంటే.. ఆయన వీడియోను యూట్యూబ్ లో అప్‌లోడ్ చేసిన వెంటనే మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తాయి. ఆయన ఛానెల్‌లో సబ్‌స్క్రైబర్ల సంఖ్య 1.8 కోట్లకు పైమాటే. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)