దగ్గు, జలుబు సిరప్‌ల వాడకంతో 66 మంది చిన్నారుల మృతి

Telugu Lo Computer
0


ఆఫ్రికా దేశమైన గాంబియాలో  దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కోసం వాడే సిరప్‌ వినియోగించి 66 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. భారత్‌లో ఓ కంపెనీ తయారు చేసిన సిరప్‌ల వల్లే ఈ మరణాలు సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ  వెల్లడించింది. పలువురిలో కిడ్నీలు దెబ్బతినడానికి ఈ సిరప్‌లు కారణమయ్యాయని పేర్కొంది. ఈ మందులపై ఇతర దేశాలకూ డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక జారీ చేసింది. గాంబియాలో మరణాలపై డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అదనోమ్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌లోని మైడెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ తయారు చేసిన సిరప్‌లు చిన్నారులను బలి తీసుకున్నాయని వెల్లడించారు. డబ్ల్యూహెచ్‌ఓ దీనిపై విచారణ ప్రారంభించిందని చెప్పారు. చిన్నారుల మరణం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నాలుగు మందులు (Promethazine Oral Solution, Kofexmalin Baby Cough Syrup, Makoff Baby Cough Syrup, Magrip N Cold Syrup) హరియాణాలో తయారవుతున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. వాటి భద్రత, నాణ్యతకు సంబంధించి ఆ కంపెనీ ఇప్పటి వరకు డబ్ల్యూహెచ్‌ఓకు ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిపింది. ఈ మందులను ప్రస్తుతానికి గాంబియాలోనే గుర్తించామని, ఇతర దేశాలకు కూడా వీటి సరఫరా జరిగి ఉండొచ్చని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. మరింత నష్టం జరగకముందే వెంటనే అన్ని దేశాలూ ఆ ఉత్పత్తులు పంపిణీ కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మందుల కారణంగా సెప్టెంబర్‌లో చిన్నారుల మరణాలు సంభవించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. లేబరేటరీలో ఆ నాలుగు మందులనూ పరిశీలించినప్పుడు వాటిల్లో మోతాదుకు మించి డైథిలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ కలిసినట్లు గుర్తించామని పేర్కొంది. గాంబియాలో మరణాలకు భారత్‌ కంపెనీ కారణమైందంటూ డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. చిన్నారుల మరణాలపై డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాను డబ్ల్యూహెచ్‌ఓ అలెర్ట్‌ చేసిన నేపథ్యంలో కేంద్ర డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ వెంటనే రంగంలోకి దిగినట్లు తెలిసింది. పూర్తి స్థాయి విచారణ చేపట్టినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మరోవైపు డబ్ల్యూహెచ్‌వో ఆరోపణలపై ఆ కంపెనీ ఇంత వరకు స్పందించలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)