ఇది 21వ శతాబ్దం

Telugu Lo Computer
0


విద్వేషపూరిత ప్రసంగాలవిషయంలో కఠినంగా వ్యవహరించాలని సుప్రీం కోర్టు పేర్కొంది. మతాలకు అతీతంగా ఈ తరహా ప్రసంగాలు చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దేశంలో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని భయభ్రాంతులకు గురిచేస్తున్న ఘటనలను అరికట్టే విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలైంది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌ల ధర్మాసనం శుక్రవారం దీనిని విచారించింది. ఈ తరహా కేసుల్లో ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కేంద్రంతోపాటు దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ పోలీస్‌ ఉన్నతాధికారుల నుంచి నివేదిక కోరింది. ద్వేషపూరిత నేరాలు, ప్రసంగాల ఘటనలపై స్వతంత్ర, విశ్వసనీయ, నిష్పక్షపాత దర్యాప్తు చేపట్టేలా కేంద్రం, రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని కూడా పిటిషనర్ కోరారు. ఈ తరహా ఘటనలను అరికట్టేందుకు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రయోగించడం వంటి కఠినమైన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా  'ఇది 21వ శతాబ్దం. మతం పేరిట మనం ఎక్కడికి చేరుకున్నాం? లౌకిక దేశంలో ఈ పరిస్థితి దిగ్భ్రాంతికరం. భారత రాజ్యాంగం శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం గురించి చెబుతోంది. దేశంలో ద్వేషపూరిత వాతావరణం నెలకొంది. కొన్ని అంశాల్లో ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నారు. ఇలాంటి వాటిని సహించలేం' అని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)