డిసెంబర్ 21వ తేదీ నాటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణం !

Telugu Lo Computer
0


ఇంటి స్థలాలు వచ్చినప్పటికీ  ఇళ్ల నిర్మాణంలో ఆలస్యం అవుతుందనే నిరాశలో ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం తీపికబురు అందించింది. ఈ ఏడాది డిసెంబర్ 21వ తేదీ నాటికి రాష్ట్రంలో 5లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారులకు టార్గెట్ విధించారు. స్పందన కార్యక్రమంపై సీఏం వైఎస్.జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సెప్టెంబర్ 29వ తేదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో పాటు పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, వాటి పురగోతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు (ఎస్ డిజి) సాధన ఆధారంగా కలెక్టర్లకు మార్కులు ఉంటాయని సీఏం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎస్ డిజి లక్ష్యాలే కలెక్టర్ల పనితీరుకు ప్రమాణమని ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ ఆర్ గృహ నిర్మాణ పథకం పై సమీక్షించిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పేద ప్రజల గృహల నిర్మాణంపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈఏడాది డిసెంబర్ 21వ తేదీ నాటికి 5లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల ఎంపిక మేరకు ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాన్ని చాలా చోట్ల ప్రారంభించింది. దీనికి సంబంధించి లబ్ధాదారులు కట్టాల్సిన డబ్బుల మొత్తాన్ని డీడీ రూపంలో ఏపీ హౌసింగ్ కార్పోరేషన్ పేరిట కట్టించుకుంది. దీంతో ఏపీలో చాలా చోట్ల మొదటి దశ గృహ నిర్మాణాలను ప్రభుత్వం ప్రారంభించింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి గృహ నిర్మాణాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది. ఈ నేపథ్యంలో గృహ నిర్మాణాలపై ఈ సమీక్షా సమావేశంలో సీఏం మాట్లాడుతూ అధికారులకు లక్ష్యాలు నిర్ధేశించారు. జగన్న కాలనీల్లో 3.5 లక్షలు, 1.5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణం డిసెంబర్ 21వ తేదీ లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే కొత్తగా గృహ నిర్మాణ పథకంలో అర్హులైన లబ్ధిదారులకు ఫేజ్-3 కింద డిసెంబర్ నెలలో గృహలు మంజూరు చేయాలని సీఏం అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన తర్వాత, ఆ కార్యక్రమంలో వచ్చిన సమస్యలను పరిష్కరించాలని సీఏం సూచించారు. నెల రోజుల్లో ప్రాధాన్యతా పనులు మొదలు కావాలని ఆదేశించారు. అక్టోబర్ 25వ తేదీన ఈ-క్రాపింగ్ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శించాలని సీఏం వైఎస్.జగన్మోహన్ రెడ్డి సూచించారు. దీనికి సంబంధించిన షెడ్యూలును అధికారులకు ముఖ్యమంత్రి వివరించారు. మరోవైపు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే వేతనాలపై కూడా ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు. ఉపాధి హామీ పథకం కింద కనీసం వేతనం రూ. 240 అందేలా చూడాలని సీఏం ఆదేశించారు. ఏ ఒక్క కూలీ నష్టపోకుండా.. అందరికీ సక్రమంగా వేతనం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్పందన కార్యక్రమంలో వస్తున్న ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను సంబంధిత విభాగం లేదా అధికారులకు ఫార్వర్డ్ చేసి ఆ సమస్యలు వేగంగా పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను సీఏం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. స్పందన కార్యక్రమంతో పాటు జాతీయ రహదారుల నిర్మాణానికి భూ సేకరణ, వైఎస్సార్ అర్బన్-విలేజ్ క్లినిక్స్ పై సమీక్షించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)