ఆర్‌బీఐ రెపో రేట్ పెంపు

Telugu Lo Computer
0


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్‌ను మరో 50 బేసిస్ పాయింట్స్ పెంచింది. దీంతో రెపో రేట్ ఏకంగా 5.90 శాతానికి పెరిగింది. గత నెలలో కూడా రెపో రేట్ 50 బేసిస్ పాయింట్స్ పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా వడ్డీ రేటు 50 బేసిస్ పాయింట్స్ పెరిగింది. 100 బేసిస్ పాయింట్స్ 1 శాతంతో సమానం. అంటే ప్రస్తుతం అరశాతం వడ్డీ పెరిగినట్టే. దీంతో ఈఎంఐలు భారీగా పెరగనున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆర్‌బీఐ రెండేళ్లపాటు వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచింది. అంతకన్నాముందు వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. అయితే ఇటీవల ద్రవ్యోల్బణం భారీగా పెరగడంతో వడ్డీ రేట్లు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మే నుంచి వడ్డీ రేట్లను దశలవారీగా పెంచుతూ వస్తోంది. మే 4న 40 బేసిస్ పాయింట్స్, జూన్ 8న 50 బేసిస్ పాయింట్స్, ఆగస్ట్ 5న 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటు పెరిగింది. దీంతో ఐదు నెలల్లో మొత్తం 190 బేసిస్ పాయింట్స్ అంటే 1.90 శాతం వడ్డీ రేటు పెరిగింది. ఆర్‌బీఐ వడ్డీ రేట్లు వడ్డీ రేట్లు పెంచాలా? తగ్గించాలా? స్థిరంగా ఉంచాలా? అనే నిర్ణయాన్ని ద్రవ్య విధాన కమిటీ సమీక్షా సమావేశంలో తీసుకుంటుంది. రెండు నెలలకు ఓసారి ఈ సమావేశం జరుగుతుంది. ఆర్‌బీఐ బ్యాంకులకు ఇచ్చే రుణాలకు వసూలు చేసే వడ్డీని రెపో రేట్ అంటారు. ఆర్‌బీఐ రెపో రేట్ పెంచితే బ్యాంకులు ఇచ్చే రుణాల వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. దీంతో కస్టమర్లకు ఈఎంఐ భారం అవుతుంది. హోమ్ లోన్, పర్సనల్ లోన్ , ఇతర రుణాల వడ్డీ రేట్లు పెరుగుతాయి. కొత్తగా రుణాలు తీసుకునేవారికీ ఎక్కువ వడ్డీ రేటు వర్తిస్తుంది. ఫలితంగా ఈఎంఐలు భారం అవుతాయి.హోమ్ లోన్ భారం కానుంది. ఆ ప్రభావం రియల్ ఎస్టేట్ సెక్టార్ పైన ఉంటుంది. హోమ్ లోన్ తీసుకునేవారిలో రెపో రేట్ లింక్డ్ లెండింగ్ రేట్ ఎంచుకుంటూ ఉంటారు. రెపో రేట్ తగ్గితే ఈ వడ్డీ తగ్గుతుంది. రెపో రేట్ పెరిగితే ఈ వడ్డీ పెరుగుతుంది. ఉదాహరణకు హోమ్ లోన్ కస్టమర్ రెపో రేట్ లింక్డ్ లెండింగ్ రేట్ ఎంచుకొని 7 శాతం వడ్డీతో ఈ ఏడాది ప్రారంభంలో హోమ్ లోన్ తీసుకున్నారనుకుందాం. మొత్తం 190 బేసిస్ పాయింట్స్ రెపో రేట్ పెరిగింది కాబట్టి వడ్డీ 8.90 శాతానికి చేరుకుంటుంది. దీంతో ఇప్పటికే చెల్లిస్తున్న హోమ్ లోన్ ఈఎంఐ కాస్త పెరుగుతుంది. అయితే వెంటనే కాకపోయినా మూడు నెలలకు ఓసారి వడ్డీ రీసెట్ చేస్తారు కాబట్టి త్వరలోనే ఈఎంఐ భారం అవుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)