కారులో ఆరు ఎయిర్ బ్యాగులు తప్పనిసరి !

Telugu Lo Computer
0


ప్రతి కారులోనూ 6 ఎయిర్ బ్యాగ్స్‌ల ఏర్పాటు తప్పనిసరి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఆటోమొబైల్ ఉత్పత్తిదారులను కోరాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి పార్లమెంటుకు శుక్రవారంనాడు తెలిపారు. ప్రతి ఎయిర్ బ్యాగ్ ఖరీదు కేవలం రూ.800 ఉంటుందని, కార్లలో భద్రతా ఫీచర్స్‌ను మెరుగుపరచేందుకు మరిన్ని ఎయిర్ బ్యాగ్‌లు ఏర్పాటు చేయాలని ఆటో మొబైల్ ఉత్పత్తిదారులను ప్రభుత్వం కోరనుందని చెప్పారు. ప్రస్తుతం ప్రతి కారులోనూ రెండు ఎయిర్ బ్యాగ్‌లు తప్పనిసరని, వెనుక సీట్లలో కూర్చునే ప్రయాణికులకు మరిత భద్రత కోసం మరో నాలుగు ఎయిర్ బ్యాగ్‌లు ఉండాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్టు గడ్కరి రాజ్యసభలో తెలిపారు. దేశంలో ఏటా లక్షకు పైగా రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్నాయని, ఎక్కడ ఏ అవసరం ఉందో వాటిని గుర్తించి సవరించడం ద్వారా ఈ మరణాలను 2024 నాటికి సగానికి తగ్గించవచ్చని గడ్కరి అన్నారు. ప్రపంచ ప్రమాణాలకు తగిన విధంగా భద్రతా తనిఖీలు నిర్వహించి అందుకు తగినట్టుగా ఉన్న వాహనాలకు స్టార్ రేటింగ్ ఇచ్చేందుకు ''భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రాం''పై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కూడా ఆయన చెప్పారు. తద్వారా మార్కెట్‌లో కొత్త వాహనం రాకముందే స్టాండర్ట్ మ్యాండేటరీ కింద క్రాష్-టెస్ట్‌లను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. కార్లలో అదనంగా మరో నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు ఏర్పాటు చేయడం వల్ల కార్ల ధరలు పెరుగుతాయంటూ ఒక వర్గం కార్ల తయారీదారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చినట్టు తెలుస్తోంది. ప్రపంచంలోని వాహనాల్లో ఇండియాలోని వాహనాలు ఒక్క శాతమే అయినప్పటికీ, ప్రపంచ మరణాల్లో భారత్ మరణాల శాతం పదకొండుగా ఉందని, ప్రపంచంలోనే ఇది అత్యధిక శాతమని ఇటీవల వరల్డ్ బ్యాంక్ ఒక నివేదికలో పేర్కొంది.


Post a Comment

0Comments

Post a Comment (0)