హెల్మెట్ లేకుండా వాహనం నడిపినందుకు మనోజ్ తివారీకి జరిమానా

Telugu Lo Computer
0


ఢిల్లీ లో 'హర్ ఘర్ తిరంగ' పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో భారతీయ జనతా పార్టీ నేత, ఎంపీ మనోజ్ తివారీ పాల్గొన్నారు. అయితే ర్యాలీలో ఆయన హెల్మెట్ లేకుండా బైక్ నడపడంతో ఢిల్లీ పోలీసులు ఆయనకు చలానా వేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్వయంగా చెప్పుకున్న ఆయన.. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనం నడిపినందుకు క్షమాపణలు చెప్పారు. హెల్మెట్ లేకుండా ఎవరూ బైక్ నడపకూడదని ప్రజలకు మనోజ్ తివారీ విజ్ణప్తి చేశారు. ఢిల్లీ పోలీసులు తనకు చలానా విధించిన ఫొటోను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో మనోజ్ తివారీ షేర్ చేస్తూ ''ఈరోజు హెల్మెట్ ధరించనందుకు క్షమాపణలు చెబుతున్నాను. ఢిల్లీ ట్రాఫిల్ పోలీసులు వేసిన చలానా చెల్లిస్తాను. స్పష్టంగా నంబర్ ప్లేట్‭తో కనిపిస్తున్న ఈ ఫొటో ఎర్రకోట సమీపంలో తీసింది'' అని ట్వీట్ చేశారు. ఇదే ట్వీట్‭లో ''హెల్మెట్ లేకుండా వాహనం నడపొద్దని నేను మీ అందరికీ విజ్ణప్తి చేస్తున్నాను. జాగ్రత్తగా వాహనం నడపండి. మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు మీరు కావాలి'' అని రాసుకొచ్చారు. ఈ ట్వీట్‭లో చేతులు జోడిస్తున్న ఎమోజీని రెండు సార్లు ప్రస్తావించారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తి కావస్తున్న సందర్భంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరిట ఏడాది కాలంగా ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దేశంలోని ప్రతి ఇళ్లు త్రివర్ణ పతాకంతో కనిపించేలా ప్రోత్సహించేందుకు 'ఇంటింటికీ తిరంగ' పేరుతో మరో కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ విషయమై ఢిల్లీ ప్రజలను ప్రోత్సహించేందుకు బుధవారం తమ కార్యకర్తలతో కలిసి బీజేపీకి చెందిన కొందరు ఎంపీలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలోనే హెల్మెట్ లేకుండా మనోజ్ తివారీ బైక్ నడిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)