బ్రహ్మోత్సవాలకు అందరికీ సర్వదర్శనం ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 8 August 2022

బ్రహ్మోత్సవాలకు అందరికీ సర్వదర్శనం !


అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు కొలవైయున్న పవిత్ర క్షేత్రం తిరుమల. శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని ఒక్కసారైనా దర్శిస్తే అంతా మంచే జరుగుతుందని భక్తులు నమ్ముతారు. అందుకే లక్షల్లో ఆ సప్తగిరీశుడ్ని దర్శించుకొని తరిస్తుంటారు. కోర్కెలు తీర్చే వెంకన్న స్వామికి భక్తులు వివిధ రూపాల్లో మొక్కుల చెల్లించుకుంటూ ఉంటారు. భక్తులు నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు స్వామివారికి సమర్పిస్తుంటారు. తిరుమలలో శ్రీనివాసుడి చెంతకు భారీగా భక్తులు పొటెత్తుతునే ఉన్నారు. అందుకే రికార్డు స్థాయిలో ఆదాయం వస్తోంది కూడా.. జులైలో అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. సాధారణ రోజుల్లోనే ఇలా ఉంటే.. ఇక బ్రహ్మోత్సవాలు సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడమే కష్టంగా ఉంది.. అందుకే ఈ సారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమలలో సెప్టెంబర్ 27 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. గత రెండేళ్లుగా కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలను టీటీడీ ఏకంతంగానే నిర్వహిస్తోంది. ప్రస్తుతం కరోనా అదుపులో ఉండటంతో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను నాలుగు మాఢవీధుల్లో ఘనంగా నిర్వహించాలని టీటీడీ తలపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు తరలివస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలోనే తమిళులకు ఎంతో ముఖ్యమైన పెరటాసి మాసం ప్రారంభం కానుంది. ముఖ్యంగా తమిళనాడు నుంచి కూడా పెద్దసంఖ్యలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు రానున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ ఏడాది టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు కేవలం సర్వదర్శనం మాత్రమే కల్పించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 300 ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని టీటీడీ చరిత్రంలో తొలిసారి రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో రోజూ లక్ష మందిపైగా భక్తులు తిరుమలకు వస్తుంటారు. అందుకే ఆర్జిత సేవలను టీటీడీ అధికారులు రద్దు చేస్తుంటారు. వృద్ధులు, వికలాంగులు, చంటిబిడ్డల తల్లిదండ్రులు, శ్రీవాణి ట్రస్టు సేవల భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శన సౌకర్యాలను నిలిపివేస్తుంటారు. ఈసారి వాటితో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్‌ల జారీ కూడా నిలిపివేసింది. బ్రహ్మోత్సవాలు జరిగే 10 రోజుల పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనం కూడా రద్దుచేయడంతో సామాన్యులకు ఎక్కువగా దర్శనభాగ్యం కల్పించినట్లు అవుతుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ఇలా బ్రహ్మోత్సవాల సమయంలో కేవలం భక్తులకు సర్వదర్శనం మాత్రమే కల్పించడం టీటీడీ చరిత్రలోనే తొలిసారి కానుంది. మరోవైపు నేటి నుంచి తిరుమలలో శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరిగింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. దీంతో ఆయా రోజుల్లో శ్రీవారి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.

No comments:

Post a Comment