కేసీఆర్ కు కోట్ల రూపాయలు ఇచ్చా !

Telugu Lo Computer
0


కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటనతో పాలిటిక్స్ మరింత హాట్ గా మారాయి. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ లోని కొందరు నేతలు అయితే.. కోమటిరెడ్డి బ్రదర్స్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలోనే సభ నిర్వహించి నష్ట నివారణకు దిగింది హస్తం పార్టీ. అయితే, అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో సైలెంట్ గా నియోజకవర్గంలో వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ఏళ్లుగా డిమాండ్ ఉన్న గట్టుప్పల్ మండలాన్ని ప్రకటించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంకా నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్న నేత కార్మికులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా చేనేత బీమా పథకాన్ని కూడా ప్రారంభించింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదివారం ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ తో తనకు ఉన్న సంబంధాలపై పలు విషయాలను బయటపెట్టారు. కేసీఆర్ కుటుంబం 35 ఏళ్లుగా తమకు చాలా క్లోజ్ అని చెప్పారు. ఉద్యమం సమయంలో కేసీఆర్ కష్టాల్లో ఉన్నప్పుడు తాను కోట్ల రూపాయలు ఇచ్చానన్నారు. తాము వేరే పార్టీలో ఉన్నప్పటికీ ఉద్యమం కోసం తానే స్వయంగా కోట్ల రూపాయలు ఇచ్చినట్లు చెప్పారు రాజగోపాల్ రెడ్డి. తద్వారా పార్టీలకు అతీతంగా తెలంగాణ వాదాన్ని బతికించామన్నారు. ఎవరూ ఊహించనంత డబ్బులను కేసీఆర్ కు సహాయం చేశానన్నారు. అయితే అదే కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ వచ్చాక నా వల్లనే తెలంగాణ వచ్చిందంటూ ప్రతిపక్ష పార్టీలే ఉండొద్దంటూ ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. 13 ఏళ్లుగా ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉన్నానన్నారు. 33 ఏళ్లుగా కాంగ్రెస్ కార్యకర్తగా పని చేసి అభ్యర్థుల విజయం కోసం పని చేశానన్నారు. తాను కష్టపడిన డబ్బులతో ప్రజలకు దానధర్మాలు చేస్తున్నానన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ప్రజలు ధర్మం వైపు నిలబడతారన్నారు. కేసీఆర్ కు, మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరగబోయే యుద్ధంగా మునుగోడు ఉప ఎన్నికలను రాజగోపాల్ రెడ్డి అభివర్ణించారు

Post a Comment

0Comments

Post a Comment (0)