మాకిది ఘోర అవమానం !

Telugu Lo Computer
0


బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు మూడు మ్యాచ్‌ల టీ20, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడేందుకు జింబాబ్వేకి వెళ్లింది. ఈ క్రమంలో జూలై 30 నాటి మొదటి టీ20లో ఆతిథ్య జింబాబ్వే చేతిలో 17 పరుగులతో ఓడిన బంగ్లా జట్టు.. రెండో టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే, నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్‌లో ఊహించని విధంగా జింబాబ్వే 10 పరుగులతో గెలుపొంది సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ విషయం గురించి ఖలీద్‌ మహమూద్‌ ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ తమ జట్టు ఆట తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ''నేను నిరాశకు లోనయ్యాను. జింబాబ్వే చేతిలో ఓడిపోతామని అస్సలు ఊహించలేదు. ఏ రకంగా చూసినా మేము ఆ జట్టు కంటే మెరుగైన స్థితిలోనే ఉన్నాము. నిజంగా మాకిది అవమానమే. ఈ విషయాన్ని తేలికగా కొట్టిపారేసే పరిస్థితి లేదు. మేము టీ20 సిరీస్‌ గెలవాల్సింది. ఇదో అసాధారణ ఓటమి'' అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇక చివరి టీ20లో తమ బ్యాటర్ల ఆట తీరును ప్రస్తావిస్తూ.. ''ఓవర్‌కి 10 నుంచి 12 పరుగులు చేయాల్సి ఉన్న పరిస్థితుల్లో ఆరు, ఏడు పరుగులు రాబట్టారు. ఒక్కరు కూడా సిక్సర్‌ కొట్టేందుకు ప్రయత్నించలేదు. అందరూ ఒకటి రెండు పరుగులు మాత్రమే తీశారు. అసలు అదంతా ఏంటో అర్థం కాలేదు.. అవుట్‌ కావొద్దని డిఫెన్స్‌ ఆడినట్లు కనిపించింది'' అంటూ మహమూద్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. కాగా మూడో టీ20లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న జింబాబ్వే.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌ ఆదిలోనే తడబడింది. ఓపెనర్లు లిటన్‌ దాస్‌(13), పర్వేజ్‌ హొసేన్‌ ఎమన్‌(2) విఫలం కాగా.. మిడిలార్డర్‌లో మహ్మదుల్లా(27) మినహా ఎవరూ కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు. అఫిఫ్‌ హొసేన్‌ ఒక్కడే 39 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచినా ఫలితం లేకుండా పోయింది. వరుసగా వికెట్లు పడటంతో 146 పరుగులకే మొసద్దెక్‌ హొసేన్‌ బృందం కథ ముగిసింది. ఆతిథ్య జట్టు చేతిలో బంగ్లా 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్‌ ఈవన్స్‌ రెండు, విక్టర్‌ మూడు, వెస్లీ ఒకటి, సీన్‌ విలియమ్స్‌ ఒకటి, ల్యూక్‌ జోంగ్వే ఒక వికెట్‌ తీశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)