వంటనూనె లీటరుకు రూ.10-12 తగ్గుదల ?

Telugu Lo Computer
0


వంట నూనెల ధరల్లో లీటరుకు రూ.10-12 మేర తయారీదార్లు కోత వేయనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా నూనె ధరలు తగ్గుతున్నందున ఆ ప్రయోజనాలను వినియోగదార్లకు అందించాలని అవి భావిస్తున్నట్లు సమాచారం. 'వంట నూనె తయారీదార్లు లీటరుకు మరో రూ.10-12 మేర కోత వేయడానికి అంగీకరించినట్లు ఆహార, వినియోగదారు వ్యహారాల మంత్రిత్వ శాఖతో జరిగిన సమావేశం అనంతరం తమతో తెలిపిన'ట్లు ఒక ఆంగ్ల పత్రిక వెల్లడించింది. అదానీ విల్మర్‌తో పాటు వంట నూనెల తయారీ కంపెనీలు ఇటీవలి కాలంలో లీటరుకు రూ.30 దాకా తగ్గించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా వంట నూనెల ధరలు కిందకు దిగిరావడం ఇందుకు నేపథ్యం. ఫార్చూన్‌ బ్రాండ్‌ కింద ఉత్పత్తులను విక్రయిస్తున్న అదానీ విల్మర్‌ సోయాబీన్‌ నూనెపై ఎక్కువగా ధర తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే ధరల తగ్గింపునకు మరింత అవకాశం ఉందని మంత్రిత్వశాఖ సూచించడంతో అందుకు తయారీదార్లు అంగీకరించారని ఒక అధికారిని ఉటంకిస్తూ ఆంగ్లపత్రికలు తెలిపాయి. అంతర్జాతీయంగా ధరలు తగ్గుతున్న నేపథ్యంలో అన్ని వంటనూనెల అసోసియేషన్లను ఆహార కార్యదర్శి సుధాంశు పాండే సమావేశానికి పిలిచారు. దిగుమతులపై ఆధారపడడం వల్లే..: ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్‌ దిగుమతిదారుగా ఉన్న భారత్‌ తన దేశీయ అవసరాలకు మలేషియా, ఇండోనేషియాలపై ఆధారపడుతోంది. ఏటా 13.5 మిలియన్‌ టన్నుల వంటనూనెను దేశం దిగుమతి చేసుకుంటుండగా.. ఇందులో 8-8.5 మి. టన్నులు(63%) పామాయిలే ఉంటోంది. ప్రస్తుతం దాదాపు 45 శాతం ఇండోనేషియా నుంచి వస్తుండగా.. మిగతా మలేషియా నుంచి దిగుమతి అవుతోంది. ఏటా ఇండోనేషియా నుంచి 4 మి. టన్నుల మేర పామాయిల్‌ను భారత్‌ దిగుమతి చేసుకుంటోంది. ఏప్రిల్‌లో పామాయిల్‌ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం విధించడంతో భారత్‌లోనూ ధరలు పెరిగాయి. మే 23న మళ్లీ నిషేధాన్ని ఎత్తివేయడంతో.. ఆ తర్వాత పరిస్థితులు కాస్త చక్కబడ్డాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)