ఉత్తరప్రదేశ్ లో మంత్రి రాజీనామా

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ జల్ శక్తి మంత్రి దినేష్ ఖటిక్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎంకు కాకుండా, నేరుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు పంపారు. దళితుడైన కారణంగానే తనను పట్టించుకోవడం లేదని, ఆ కారణంగానే తాను రాజీనామా చేస్తున్నానని ఆ రాజీనామా లేఖలో మంత్రి దినేష్ ఫిర్యాదు చేశారు. కాగా, యోగి ఆదిత్యనాథ్‌ పట్ల అసంతృప్తితో ఉన్న మరో మంత్రి జితిన్ ప్రసాద కూడా ఢిల్లీ చేరుకుని బీజేపీ నేతలతో సమావేశమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఉత్తరప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రిగా ఉన్న దినేష్ ఖటిక్ తన రాజీనామా లేఖలో గత 100 రోజులుగా ఎలాంటి పని తనకు అప్పగించలేదని ఆరోపించారు. ''దళితుడనే కారణంగానే నాకెలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. మంత్రిగా నాకెలాంటి అధికారాలు లేవు. దళిత కమ్యూనిటీకి చెందినవాడిగా ఉండి కూడా వారికి ఏమీ చేయలేకపోవడం వల్ల నాకు ఇచ్చిన సహాయ మంత్రి శాఖ వృథా. నన్ను ఏ సమావేశానికి పిలవడం లేదు. నా శాఖకు సంబంధించిన ఏ విషయం చెప్పడంలేదు. ఇది దళిత వర్గాన్ని అవమానించడమే'' అని ఆయన తెలిపారు. కాగా, తన టీమ్‌లోని ఒక అధికారిని ముఖ్యమంత్రి సస్పెండ్ చేయడంపై జితిన్ ప్రసాద ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. గత ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీకి జితిన్ ప్రసాద రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇందుకు ప్రతిగా ఆయనకు యోగి మంత్రివర్గంలో కీలకమైన ప్రజాపనుల శాఖ (PWD) మంత్రి పదవి దక్కింది. అయితే ఆ శాఖ అవినీతి ఆరోపణలను ఎదుర్కొటోంది. పలువురు అధికారులు బదిలీల కోసం లంచాలు తీసుకుంటున్నట్టు గుర్తించడంతో దీనిపై విచారణకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించినట్టు తెలుస్తోంది. బదిలీలు, పోస్టింగ్‌ల కోసం లంచాలు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో జితిన్ ప్రసాద్‌ ఓఎస్‌డీ  అనిల్ కుమార్ పాండే కూడా ఉన్నారు. పాండేను తొలగించి ఆయనపై విజిలెన్స్ ఎంక్వైరీ ప్రారంభించారు. పాండే బాస్‌గా జితిన్ ప్రసాద కూడా అవినీతి అంశంపై ప్రశ్నలు ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యమంత్రి సైతం జితిన్ ప్రసాదను పిలిపించి పాండేపై ఉన్న అవినీతి ఆరోపణలపై నిగ్గుతేల్చే బాధ్యత తీసుకోవాలని చెప్పినట్టు సమాచారం. కాగా, సీఎం తీరుపై అసంతృప్తితో ఉన్న జితిన్ ప్రసాద దీనిపై ఫిర్యాదు చేసేందుకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్ కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)