లోదుస్తులు చేతుల్లో పట్టుకుని వెళ్ళమన్నారు

Telugu Lo Computer
0


ఇటీవల నీట్ పరీక్ష సందర్భంగా కేరళలోని మార్థోమా ఇన్‌స్టిట్యూట్‌లో అక్కడి సిబ్బంది విద్యార్థినుల పట్ల వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై బాధిత విద్యార్థినుల్లో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆ విద్యార్థిని ఆరోజు తమకెదురైన చేదు అనుభవాన్ని వివరించింది. లోదుస్తులు విప్పించడం.. పరీక్షా హాల్‌లోకి చున్నీతో వెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో తల వెంట్రుకలతోనే ఎద భాగాన్ని కప్పుకోవాల్సి వచ్చిందని ఆమె వాపోయింది. అబ్బాయిలతో కలిసి పరీక్ష రాయాల్సిన చోట ఇటువంటి పరిస్థితి ఎదురవడం తమకు చాలా అవమానంగా, బాధగా అనిపించిందని ఆవేదన వ్యక్తం చేసింది. పరీక్షా కేంద్రం వద్ద రెండు క్యూ లైన్లు ఏర్పాటు చేశారని.. ఒక క్యూ లైన్‌లో మెటల్ డిటెక్టర్‌తో తనిఖీలు నిర్వహించారని ఆ విద్యార్థిని పేర్కొంది. తాను ధరించిన బ్రాకి హుక్ ఉందా అని సిబ్బంది అడిగారని.. ఉందని చెప్పడంతో.. లోదుస్తులు తొలగించాకే పరీక్షా కేంద్రంలోకి వెళ్లమన్నారని తెలిపింది. పక్కనే రెండో క్యూ లైన్‌లో విద్యార్థినులంతా లోదుస్తులు తొలగించేందుకు నిలుచున్నారని వెల్లడించింది. వారంతా వరుసగా ఓ గదిలోకి వెళ్లి లోదుస్తులు తొలగించి వస్తున్నారని.. తాను లోపలికి వెళ్లేసరికి ఆ గది మొత్తం చీకటిగా ఉందని.. ఫ్లోర్‌ పైనే లోదుస్తులు పడి ఉన్నాయని తెలిపింది. పరీక్ష రాసి మళ్లీ ఆ గది వద్దకు వెళ్లిన సమయంలో అప్పటికే చాలామంది విద్యార్థినులు అక్కడ ఉన్నారని పేర్కొంది. తన లోదుస్తులు దొరికాయని... ఓ విద్యార్థిని ఏడుస్తూ కనిపించిందని తెలిపింది. ఎందుకు ఏడవడం.. ఇదంతా పరీక్షా ప్రక్రియలో భాగమని సిబ్బంది చెప్పారని.. అంతేకాదు, లోదుస్తులు చేతుల్లో పట్టుకుని వెళ్లిపోవాలని సిబ్బంది చెప్పడం మరింత బాధ కలిగించిందని వాపోయింది. అయినప్పటికీ లోదుస్తులు ధరించాకే తాము అక్కడి నుంచి వెళ్లామని చెప్పుకొచ్చింది. నీట్ పరీక్ష సందర్బంగా విద్యార్థినుల లోదుస్తులు విప్పించిన వ్యవహారంపై ఐదుగురు మహిళా సిబ్బందిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సిబ్బంది కాగా మరో ఇద్దరు ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన సిబ్బంది. ఈ ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో మార్థోమా ఇన్‌స్టిట్యూట్ సెంటర్ సూపరింటెండ్ మాత్రం ఈ వ్యవహారాన్ని ఖండించడం గమనార్హం. అసలు ఇలా జరిగినట్లు తమ దృష్టికి రాలేదని సూపరింటెండెంట్ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)