ఆటో నడిపిన జగన్మోహనరెడ్డి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పర్యటనలో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ వాహనమిత్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ మేరకు 2022-23 సంవత్సరానికి రాష్ట్రంలో సొంత ఆటోలు, ట్యాక్సీలు, క్యాబ్ డ్రైవర్లకు వైఎస్ఆర్ వాహనమిత్ర పథకంలో భాగంగా నాలుగో విడతగా దాదాపు 2,61,516 మంది లబ్ధిదారులకు రూ.10వేలు చొప్పున రూ.261.51 కోట్ల ఆర్ధిక సహాయం అందించింది. దీంతో గత నాలుగేళ్లలో ఏకంగా 10.25 లక్షల మంది డ్రైవర్లకు రూ.1,025.96 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం ఆర్థిక సాయం చేసినట్లయ్యింది. కాగా ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ ఆటో డ్రైవర్ తరహాలో యూనిఫామ్ ధరించి కాసేపు ఆటో నడిపారు. దీంతో అక్కడున్న అధికారులంతా ఈ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే వాహనమిత్ర పథకం ప్రారంభించామన్నారు. కరోనా సమయంలోనూ వాహన మిత్ర పథకం అమలు చేశామని తెలిపారు. ఇది పేదల ప్రభుత్వం అని.. పేదలకు అండగా ఉండే ప్రభుత్వమని అభిప్రాయపడ్డారు. ఎక్కడా కూడా లంచాలకు తావు లేకుండా, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. కులం చూడకుండా, పార్టీ చూడకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. అప్పటి ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు గమనించాలని సీఎం జగన్ కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)