ఒడెస్సా పోర్ట్‌పై రష్యా దాడులు

Telugu Lo Computer
0


ఉక్రెయిన్‌లోని ఒడెస్సా నౌకాశ్రయంపై రష్యా క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఆహార ధాన్యాల ఎగుమతుల పునః ప్రారంభానికి ఈ రెండు దేశాలు వేర్వేరుగా ఒప్పందం చేసుకుని 24 గంటలు గడవకముందే ఈ దాడులు జరగడం గమనార్హం. శుక్రవారంనాటి ఒప్పందం ప్రకారం.. ఉక్రెయిన్‌లో నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సాతోపాటు మరో రెండు రేవుల నుంచి ఎగుమతులు ప్రారంభం కావాల్సి ఉంది. అంతలోనే మాస్కో క్షిపణులు దాడి చేశాయంటూ స్థానిక ఎంపీ ఒలెక్‌సీ గొంచరెంకో విమర్శించారు. మొత్తం నాలుగు మిసైళ్లను ప్రయోగించగా వాటిలో రెండింటిని అడ్డుకున్నట్టు చెప్పారు. ఒడెస్సా పోర్టుపై దాడి ఘటనలో పలువురు గాయపడినట్లు వెల్లడించారు. 'ఒడెస్సా పోర్ట్‌పై మాస్కో దళాలు క్షిపణులతో దాడికి పాల్పడ్డాయి. ధాన్యం ఎగుమతులపై ఒప్పందం చేసుకుని ఒక్క రోజు గడవకముందే ఈ ఘటన జరిగింది. దీన్ని బట్టి ఒప్పందాల విషయంలో రష్యా వైఖరి అర్థం చేసుకోవచ్చు. ఒడెస్సాను కాపాడుకునేందుకు ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయండి. రష్యాకు బలప్రదర్శన మాత్రమే అర్థం అవుతుంది' అని ఆయన ట్వీట్‌ చేశారు. ఒకవేళ ధాన్యం ఎగుమతుల ఒప్పందం విషయంలో ఏదైనా విఘాతం కలిగితే.. తద్వారా ఏర్పడే ఆహార సంక్షోభానికి రష్యాదే పూర్తి బాధ్యత అని ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి ఓలెగ్‌ నికొలెంకో స్పష్టం చేశారు. ఐరాస, తుర్కియేలతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి దాడులకు పాల్పడేందుకు రష్యాకు 24 గంటలూ పట్టలేదంటూ మండిపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)