తెలంగాణలో కలపాలంటూ ఆందోళన ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 24 July 2022

తెలంగాణలో కలపాలంటూ ఆందోళన !


ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ మధ్య పోలవరం వ్యవహారం కొద్ది రోజుల క్రితం మాటల యుద్దం సాగింది. పోలవరం కారణంగానే తెలంగాణలోని భద్రాద్రి ప్రాంతంలో వరదలు వచ్చాయంటూ తెలంగాణ మంత్రులు ఆరోపించారు.  ముంపు మండలాల వ్యవహారం పైన కొత్త డిమాండ్లు తెర మీదకు వస్తున్నాయి. రాష్ట్ర విభజన చట్టం పార్లమెంట్ లో ఆమోదం పొందిన తరువాత నాడు రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువు తీరే వేళ.. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వటం..ముంపు ప్రాంతాలను పరిగణలోకి తీసుకొని నాడు ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లోనే తెలంగాణ రాజకీయ పార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ఇప్పుడు, తాజాగా భద్రాద్రి జిల్లా ఏపీ-తెలంగాణ సరిహద్దు వద్ద పలు గ్రామాల ప్రజలు ఆందోళన ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్​లో ఉన్న తమ గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలంటూ ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న ఇరు రాష్ట్రాల పోలీసులు అక్కడికి చేరుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా - ఏపీ సరిహద్దుగా ఉన్న అయిదు గ్రామాల ప్రజలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. తమ అయిదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కన్నాయిగూడెం, పిచుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం, ఏటపాక గ్రామాల ప్రజలు.. భద్రాచలం శివారులో రోడ్డుపై వాహనాలు నిలిపివేసి ఆందోళన నిర్వహించారు. సరిహద్దు గ్రామాలు కావటంతో రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న వారికి కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య మద్దతు ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఈ ఆందోళనకు స్థానికంగా రాజకీయంగానూ మద్దతు లభిస్తోంది. వరదల సమయంలో తమకు సాయం అందలేదని వాపోతున్నారు. ఈ  గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపటం సాధ్యమా కాదా అనే చర్చ మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం ఇదే డిమాండ్ వినిపిస్తోంది. కానీ, ఈ నిర్ణయం కేంద్రం చేతిలో ఉంది. ఇప్పటికే ఈ గ్రామాల నుంచి ఇదే డిమాండ్ పైన తీర్మానాలు సైతం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ..పూర్తి చేయటం పైన ఇప్పుడు ఏపీలో రాజకీయంగానూ వివాదం కొనసాగుతోంది. ఈ సమయంలో తాజాగా గ్రామాల విలీనం అంశం ఏపీ ప్రభుత్వానికి కొత్త సమస్యగా మారే అవకాశం కనిపిస్తోంది.

No comments:

Post a Comment