ఔషధాల ధరల తగ్గింపు

Telugu Lo Computer
0


జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ పలు రకాల ఔషధాల ధరలను తగ్గిస్తూ  నిర్ణయం తీసుకుంది. మధుమేహం, రక్తపోటుతో పాటు కొలెస్ట్రాల్‌, గుండె పోటు, పక్షవాతం, ఒంటి నొప్పుల వంటి సమస్యల నివారణకు వాడే ముఖ్యమైన ఔషధాల ధరలను 30 నుంచి 40 శాతం మధ్య తగ్గించింది. ఈ తగ్గించిన ధరల మేరకే వాటిని విక్రయించాలని పేర్కొంది. అలాగే, ఈ ఔషధాలను పలు రకాల ఫార్ములాలతో కొత్తగా మార్కెట్‌లోకి తీసుకురావాలంటే సర్కారు అనుమతి పొందాలని తెలిపింది. దీంతో నూతన ఔషధం పేరిట మందులను ఇష్టం వచ్చినట్లు అమ్మే అవకాశం ఉత్పత్తి సంస్థలకు ఉండదు. అలాగే, ఆయా సంస్థలు నిర్ణీత ధరలను కచ్చితంగా పాటించాల్సిందేనని లేదంటే వడ్డీతో పాటు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ప్రతి రిటైలర్‌, డీలర్ ఆయా మందుల ధరల జాబితాను దుకాణాల్లో ప్రదర్శించాలని ఆదేశించింది. అలాగే, లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ అండ్‌ ఆక్సిజన్‌ ఇన్‌హేలేషన్‌కు సంబంధించి సవరించిన సీలింగ్‌ ధరను సెప్టెంబరు 30 వరకు పొడిగించినట్లు పేర్కొంది. జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం సిప్లా, ప్యూర్‌ అండ్‌ కేర్‌ హెల్త్‌కేర్ వంటి సంస్థలకు చెందిన హృద్రోగం, మధుమేహానికి వాడు అటోర్వాస్టాటిన్‌, ఫెనోఫైబ్రేట్ ట్యాబ్లెట్ ధర రూ.13.87 చొప్పున ఉంది. అలాగే అకుమ్స్‌ డ్రగ్స్‌ ఫార్మాస్యూటికల్స్‌, జర్మన్‌ రెమెడీస్‌ ఫార్మాస్యూటికల్స్ అమ్మే ఒల్మెసార్టన్‌ ప్లస్‌ మెడోక్సోమిల్‌ ప్లస్‌ అమ్లోడిపైన్‌ ప్లస్‌ హైడ్రోక్లోరోథియాజైడ్ ధర రూ.12.91కి తగ్గింది. వొగ్లిబోస్‌-మెట్‌ఫార్మిన్‌ హైడ్రోక్లోరైడ్ ట్యాబ్లెట్‌ ధర రూ.10.47గా ఉంది. పారాసిటమాల్‌, కెఫిన్‌ల ధర ట్యాబ్లెట్‌ రూ.2.88కి చేరింది. రోసువాస్టాటిన్‌ ఆస్పిరిన్‌, క్లోపిడోగ్రెల్‌ క్యాప్సూల్‌ ధర రూ.13.91గా ఉంది. శ్వాసకోశ, పలు రకాల ఇన్‌ఫెక్షన్లకు వాడే అమోక్సిసిలిన్‌-పొటాషియం క్లావులనేట్‌ ఐపీ ఒక్కో ట్యాబ్లెట్‌ ధర రూ.34.03కి చేరింది. రక్తహీనత సమస్యకు వాడే ఫెర్రస్‌ అస్కార్‌బేట్‌ ఫోలిక్‌ యాసిడ్‌ ఓరల్‌ డ్రాప్స్‌ గరిష్ఠ ధర ప్రతి ఎంఎల్‌కు రూ.5.06గా ఉంది. నొప్పి, వాపులు తగ్గడానికి వాడే అసెక్లోఫినాక్‌ పారాసిటమాల్‌, ట్రిప్సిన్‌, క్రైమోట్రిప్సిన్‌ కాంబినేషన్ ట్యాబ్లెట్ ధర రూ.13.85గా సవరించింది. క్లోపిడొగ్రెల్‌, ఆస్పిరిన్‌ మాత్రల ధర రూ.4.34 చొప్పున ఉంది. అలాగే, ఎముకల బలానికి వాడే కాల్షియం కార్బోనేట్‌, కాల్షిట్రోల్‌-జింక్‌ క్యాప్స్యూల్ ధర రూ.14.07గా నిర్ణయించింది. ఆపరేషన్ తర్వాత, ఇన్‌ఫెక్షన్‌ తీవ్రంగా ఉన్నప్పుడు వాడే సెఫ్‌ట్రైయాక్సిన్‌-టాజోబాక్టమ్‌ ఇంజక్షన్ ధర రూ.168.43గా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)