ఇంటి ఓనర్‌ను హత్య చేసిన కిరాయిదారుడు !

Telugu Lo Computer
0


కర్ణాటకలోని దక్షిణ బెంగళూరులో అద్దెకుంటున్న ఒక వ్యక్తి ఇంటి ఓనర్ యశోదమ్మ (75)ను ఏకంగా 91 సార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జై కిషన్ అనే వ్యక్తి దక్షిణ బెంగళూరులోని, వినాయక నగర్‌లో ఒక ఇంట్లో, రెండో ఫ్లోర్‌లో అద్దెకుంటున్నాడు. . జై కిషన్ ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో మార్కెటింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, అతడికి అనేక అప్పులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఈ క్రమంలో డబ్బు సంపాదించేందుకు ఒక ఉపాయం ఆలోచించాడు. వృద్ధురాలైన ఇంటి ఓనర్‌ను చంపి, ఆమె ఒంటిపై ఉండే నగలు తీసుకోవాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే ఈ నెల 2న రాత్రి తొమ్మిదన్నరకు ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం ఆమె నగలు తీసుకున్నాడు. హత్య చేసిన తర్వాత ఎవరికీ అనుమానం రాకూడదనే ఉద్దేశంతో యశోదమ్మ ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉందని తనే ఆమె కొడుక్కి ఫోన్ చేశాడు. ఈలోపు అదే ఇంట్లో అద్దెకుంటున్న మరో వ్యక్తి అంబులెన్స్ పిలిపించడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదైంది. తర్వాత ఆమె కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలో ఎవరికీ జై కిషన్ మీద అనుమానం కలగలేదు. తర్వాత అతడు ఆమె నగలు అమ్మి బ్యాంకు లోన్లు తీర్చేశాడు. దాదాపు నాలుగు లక్షల రూపాయలు బిల్లు కట్టేశాడు. మరోవైపు పోలీసులు దాదాపు వంద మందిని అనేక కోణాల్లో విచారించారు. అందులో జై కిషన్ గురించి ఎవరికీ అనుమానం కలగలేదు. చుట్టుపక్కల సీసీ కెమెరాలు కూడా లేకపోవడంతో ఎలాంటి ఆధారం దొరకలేదు. ఒక దశలో పోలీసులకు ఈ కేసు పరిష్కరిచడం చాలా కష్టంగా మారింది. అయితే, అనేక విచారణల తర్వాత జై కిషన్ లావాదేవీల విషయంలో అనుమానం కలిగింది. ముందుగా అతడు నేరం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. చివరకు పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నేరం అంగీకరించాడు. నగల కోసం తనే హత్య చేసినట్లు చెప్పాడు. ప్రస్తుతం అతడిని పోలీసులు కోర్టులో హాజరుపర్చి, జైలుకు తరలించారు. మరోవైపు యశోదమ్మ మృతదేహంపై దాదాపు 91 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టమ్ నివేదికలో తేలింది.

Post a Comment

0Comments

Post a Comment (0)