మూడు మెట్రో స్టేషన్‌లు మూసివేత

Telugu Lo Computer
0


బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల అనంతరం ఆదివారం సాయంత్రం 6 గంటలకు బీజేపీ విజయ సంకల్ప సభ భారీ స్థాయిలో జరగనుంది. సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే ఈ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు హాజరుకానున్నారు. పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సభలో ఆశీనులు అవుతారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తుతో పాటు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ మెట్రో అధికారులు కూడా ప్రయాణికులకు కీలక సూచనలు చేశారు. ఆదివారం సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పారడైజ్, పరేడ్ గ్రౌండ్స్, జేబీఎస్ మెట్రో స్టేషన్‌లను మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో అధికారులు వెల్లడించారు. ఈ మూడు స్టేషన్‌లలో మెట్రో రైళ్లు ఆగకుండా వెళ్తాయని, ప్రయాణికులు గమనించాలని సూచించారు. ప్రధాని మోదీ సభ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఆయా మెట్రో స్టేషన్‌లను మూసివేస్తున్నట్లు వివరించారు. మిగిలిన స్టేషన్లలో సర్వీసులు యథాతథంగా నడుస్తాయంటూ హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. కాగా ఆదివారం నాడు నగరంలోని మెట్రో రైళ్లు నిలిపివేస్తున్నట్లు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని.. వాటిని నమ్మవద్దని అభ్యర్థించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)