అచ్చెన్నాయుడు పేరుతో ఫేక్‌ ప్రకటన హల్‌చల్ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ ప్రకటన హల్‌చల్‌ చేస్తోంది.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వలంటీర్ల వ్యవస్థని, సచివాలయ వ్యవస్థని రద్దు చేస్తామని అచ్చెన్న పేరుతో నకిలీ ప్రకటన సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. అయితే, ఈ ప్రకటనను తెలుగు దేశం పార్టీ తీవ్రంగా ఖండించింది. “తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.. పార్టీ అధికారంలోకి రాగానే వాలంటీర్‌ వ్యవస్థను రద్దు చేసి, సచివాలయ వ్యవస్థను తీసేసి రాష్ట్రానికి విముక్తి కలిగిస్తాము.. ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ వైకాపా మనుషులే అని మనకు తెలుసు.. కాబట్టి ఈ వ్యవస్థను తీసేసి కొత్తగా రాష్ట్రాన్ని నిర్మించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది అని హామీ ఇస్తున్నాము” అని పేర్కొన్నట్టుగా ప్రకటన ఉంది. ప్రకటనపై సోషల్‌ మీడియాలో రచ్చ చేయడంపై తీవ్రంగా స్పందించారు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌ బాబు.. గందరగోళం సృష్టించడానికే తప్పుడు పనులు చేస్తున్నారన్న ఆయన.. సచివాలయ వ్యవస్థని రద్దు చేస్తున్నామంటూ అచ్చెన్న పేరుపై సోషల్ మీడియాలో తిరుగుతున్న ప్రకటన నకిలీదని స్పష్టం చేశారు. అచ్చెన్నాయుడు గానీ, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గానీ దీనికి సంబంధించి ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదన్న ఆయన.. సోషల్ మీడియా ద్వారా సంబంధిత వ్యవస్థలో గందరగోళం సృష్టించేందుకు వైసీపీ నేతలు ఆడుతున్న పన్నాగంలో భాగమే ఈ నకిలీ ప్రకటన అని ఆరోపించారు. నకిలీ ప్రకటనను వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని త్వరలో ఫిర్యాదు చేస్తామని అశోక్‌ బాబు అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)