సిక్‌లీవ్‌ లో ఇండిగో ఉద్యోగులు : 900 సర్వీసులు ఆలస్యం

Telugu Lo Computer
0


ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సంస్థకు చెందిన మొత్తం సిబ్బందిలో  దాదాపు సగానికిపైగా ఒకేరోజు సిక్‌లీవ్‌లో వెళ్లడం చర్చనీయాంశమయ్యింది. దీంతో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సర్వీసులకు తీవ్రం అంతరాయం కలగడంతోపాటు అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు సమాచారం. శనివారం ఒక్కరోజే దాదాపు 900 సర్వీసులపై ఈ ప్రభావం పడినట్లు పౌరవిమానయాన శాఖ ధ్రువీకరించింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన డీజీసీఏ.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ నుంచి వివరణ కోరింది. అయితే, సిక్‌లీవ్‌ పెట్టిన సిబ్బంది అంతా ఎయిర్‌ ఇండియా నిర్వహిస్తోన్న ఉద్యోగ నియామకాల ఇంటర్వ్యూల కోసం వెళ్లినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ప్రముఖ విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో నిత్యం దాదాపు 1600 దేశీయ, అంతర్జాతీయ సర్వీసులను నడిపిస్తోంది. అయితే, వీటిలో శనివారం రోజున కేవలం 45.2శాతం సర్వీసులు మాత్రమే నడిచినట్లు డీజీసీఏ పేర్కొంది. ఆదివారం కూడా ఇదే విధమైన సమస్య తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై డీజీసీఏ చీఫ్‌ అరుణ్‌ కుమార్‌ స్పందించారు. ఈ పరిణామంపై దృష్టి సారించామని అన్నారు. అయితే, దీనిపై ఇండిగో మాత్రం స్పందించలేదు. మిగతా విమానయాన సంస్థలైన ఎయిర్‌ ఇండియా (77శాతం), స్పైస్‌ జెట్‌ (80.4శాతం), విస్తారా (86.3శాతం), గో ఫస్ట్‌ (88శాతం), ఎయిర్‌ఏసియా (92.3శాతం) సంస్థలు శనివారం తమ సర్వీసులను కొనసాగించాయి. ఎయిర్‌ ఇండియా విమాన సంస్థను టాటా గ్రూప్‌ జనవరి 27న సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం కొత్తగా క్యాబిన్‌ క్రూ నియామకాలను చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం నిర్వహించిన ఇంటర్వ్యూలకు ఇండిగో నుంచే భారీస్థాయిలో సిబ్బంది తరలివెళ్లినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)