క్షత్రియుల భవన నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.65 లక్షలు కేటాయింపు

Telugu Lo Computer
0


అగ్ని కుల క్షత్రియుల భవన నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నుంచి ఎంపీ కేశినేని నాని రూ. 65 లక్షలు కేటాయించారు. విజయవాడ ఆటో నగర్‌లో తమకున్న స్థలంలో అగ్నికుల క్షత్రియులు భవన నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు ఎంపీ ల్యాడ్స్ నిధులను కేటాయించినందుకు ఎంపీ కేశినేని నానికి అగ్నికుల క్షత్రియులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అభివృద్ధి, పరిపాలన విషయంలో చంద్రబాబు తీరును కేశినేని నాని ప్రశంసించారు. కొంత కాలంగా పార్టీపై కేశినేని నాని గుర్రుగా ఉన్నారనే ప్రచారంతో తాజాగా కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తించాయి. కొన్ని విషయాల్లో తాను గద్దె రామ్మోహన్‌కు ఏకలవ్య శిష్యుడిని అని, కొంత మంది వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని.. కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయడంలో గద్దె రామ్మోహన్ ముందు వరుసలో ఉంటారని కేశినేని నాని కొనియాడారు. అగ్నికుల క్షత్రియుల భవనం విషయంలో గద్దె రామ్మోహన్ కృషి ఉందని ఎంపీ కేశినేని నాని వెల్లడించారు. యాంటీ వేవ్‌లో కూడా గద్దె గెలిచారని గుర్తుచేశారు. తన ఎంపీ ల్యాడ్స్ అంతా గద్దె రామ్మోహన్‌కే ఇస్తానని కేశినేని నాని తెలిపారు. జగన్‌కు ఎందుకు ఛాన్స్ ఇచ్చారో కానీ, నష్టపోయింది పేద ప్రజలే అని ఆయన ఆరోపించారు. ఎకానమీ దెబ్బ తినడం వల్ల పేదలే నష్టపోయారన్నారు. గద్దె రామ్మోహన్ లాంటి లీడర్లను ఎన్నుకుంటే ప్రజలకే మంచిదని సూచించారు. ఫ్లైఓవర్లు తామే వేశామని సజ్జల చెప్పుకుంటున్నారని, ఆయనకు కౌంటర్ ఇవ్వడం కూడా టైమ్ వేస్ట్ అని కేశినేని నాని చురకలు అంటారు. విజయవాడలో ఫ్లైఓవర్లు ఎవరు కట్టించారో ప్రజలకు తెలుసు అని, తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు సేవ చేసి.. అభివృద్ధి చేయడంలో చంద్రబాబుకు సంతృప్తి ఉంటుందన్నారు. సమాజాన్ని, వ్యవస్థలను నాశనం చేస్తే ఎలాంటి సంతృప్తి ఉండదన్నారు. సమాజాన్ని నాశనం చేసి తమ కుటుంబం బాగుపడాలని కొందరు కోరుకుంటారని కేశినేని నాని జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శలు చేశారు. అగ్నికుల క్షత్రియుల భవన నిర్మాణానికి కేశినేని నాని పెద్ద హృదయంతో నిధులు కేటాయించారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ప్రశంసలు కురిపించారు. భవన నిర్మాణానికి రూ. 65 లక్షలు అంచనా అని చెబితే.. ఆ మొత్తాన్ని ఆమోదించేశారన్నారు. అగ్నికుల క్షత్రియుల భవన నిర్మాణం వల్ల కేవలం కృష్ణా, విజయవాడల్లో ఉన్న వారే కాకుండా.. ఏపీలోని అగ్నికుల క్షత్రియులంతా కేశినేని నానిని గుర్తుంచుకుంటారని కొనియాడారు. మత్స్యకారులకు అండగా ఉంటోంది టీడీపీనే.. వైసీపీ ఇప్పుడేదో మాయ మాటలు చెబుతోందని మండిపడ్డారు. వలలు, పడవలు లేకుండా మత్స్యకార భరోసా పేరుతో వైసీపీ మభ్యపెడుతోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బెజవాడ లోక్ సభ నుంచి కేశినేని నానిని మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)