2100 నాటికి దేశ జనాభా 100 కోట్లకు పడిపోతుంది ?

Telugu Lo Computer
0


అమెరికాలోని స్టాన్‪ఫోర్డ్ యూనివర్సిటీ తాజాగా విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం మన దేశ ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయి క్రమంగా జనాభా అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. జనాభా విపరీతంగా పెరిగిపోయినప్పుడు వనరులు భారీగా తగ్గిపోతాయి. దీనివల్ల జీవన ప్రమాణాలు తగ్గుతాయి. అంతిమంగా జనాభా తగ్గుదల మొదలవుతుంది. సంతానోత్పత్తి రేటు తగ్గడం కూడా జనాభా తగ్గుదలకు కారణమవుతుంది. మన దేశంలో ఒక మహిళ సంతానోత్పత్తి రేటు ప్రస్తుతం 1.76గా ఉండగా, 2032 సంవత్సరం నాటికి 1.39, 2052 నాటికి 1.28, 2082 నాటికి 1.2, 2100 సంవత్సరం నాటికి 1.19గా ఉండే అవకాశం ఉంది. భారత్‌తో పాటు చైనా, అమెరికాలోనూ వచ్చే 78 ఏళ్లలో జనాభా తగ్గిపోనుంది. ముఖ్యంగా చైనా జనాభా 2100 నాటికి 49 కోట్లకు పడిపోనుంది. అక్కడ సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుతుండటమే ఇందుకు కారణం. రానున్న రోజుల్లో భారత జనసాంద్రత ఆందోళనకర స్థాయిలో పడిపోతుందని నివేదిక చెప్పింది. జనాభా విషయంలో భారత్, చైనా ఒకేలా కన్పిస్తున్నప్పటికీ.. జనసాంద్రతకు వచ్చేసరికి చాలా వ్యత్యాసం ఉంది. జనాభాలో మనం చైనా తర్వాత ఉన్నప్పటికీ.. జన సాంద్రతలో మాత్రం మనమే ముందున్నాం. భారత్‌లో ప్రతి చదరపు కిలోమీటర్‌కు 476మంది నివసిస్తారు. చైనాలో మాత్రం ఆ సంఖ్య 148 మంది మాత్రమే. 2100 నాటికి భారత్‌లో జనసాంద్రత 335కి పడిపోతుందని, ఇది ప్రపంచం మొత్తంతో పోల్చితే చాలా ఎక్కువ అని అధ్యయనం అంచనా వేసింది. 2100 నాటికి మన దేశంలో చదరపు కిలోమీటరుకు 335 మంది జీవిస్తే, చైనాలో 51 మందే జీవిస్తారు. చదరపు కిలోమీటరుకు అమెరికాలో ప్రస్తుతం సగటున 37 మంది జీవిస్తే, 2100కల్లా 31 మంది నివసిస్తారు. జపాన్‌లో ప్రస్తుతం 329 మంది జీవిస్తే, 2100 నాటికి 133 మంది మాత్రమే జీవిస్తారు. అంటే మన దేశంతోపాటు అన్ని దేశాల్లోనూ జనాభా, జన సాంద్రత విపరీతంగా తగ్గుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)