త్రివిధ దళాధిపతులతో మోదీ కీలక భేటీ ?

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా అగ్నిపథ్ పథకంపై యువత నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు త్రివిధ దళాధిపతులతో భేటీ కానున్నారు.ఈ ముగ్గురితో విడి విడిగా భేటీ కానున్న మోదీ అగ్నిపథ్ పథకంపై చర్చించను న్నారు. ఈ సందర్భంగా పథకం అమలుపై త్రివిధ దళాధిపతులు కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. మొదట నేవీ చీఫ్ ఆర్.హరి కుమార్‌తో మోదీ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14న కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ స్కీమ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా నాలుగేళ్ల కాల పరిమితితో అభ్యర్థుల రిక్రూట్‌మెంట్ జరగనుంది. వీరిలో 25 శాతం మందిని మాత్రమే రెగ్యులరైజ్ చేస్తారు. మిగతా 75 శాతం అభ్యర్థుల సర్వీస్ నాలుగేళ్లకే ముగుస్తుంది.దీనిపై దేశవ్యాప్తంగా యువత నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ముఖ్యంగా ఔత్సాహిక అభ్యర్థులు భారీ ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో బీహార్, తెలంగాణ లాంటి చోట్ల తీవ్ర హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. సికింద్రాబాద్‌లో ఆందోళనకారులను అదుపు చేసే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. ఇంత జరిగినప్పటికీ కేంద్రం మాత్రం అగ్నిపథ్‌పై వెనక్కి తగ్గలేదు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. ఈ స్కీమ్ ద్వారా రిక్రూట్ అయ్యే అగ్నివీరులకు మొదటి ఏడాది రూ.30 వేల వేతనం, రెండో ఏడాది రూ.33 వేల వేతనం, మూడో ఏడాది రూ.36,500 వేతనం, నాలుగో ఏడాది రూ.40 వేల వేతనం అందిస్తారు. వీరికి ప్రత్యేక ర్యాంక్ కేటాయించనున్నారు. సర్వీస్ ముగిశాక సేవా నిధి ప్యాకేజీ కింద రూ.12 లక్షల వరకు అందజేస్తారు. సర్వీస్ తర్వాత వీరికి బ్యాంకుల నుంచి రుణ సదుపాయం కూడా ఉంటుంది. ఈ ఏడాది సుమారు 46 వేల మంది అగ్నివీరులను రిక్రూట్ చేయనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)