లంకలో రెండు వారాల పాటు షట్‌డౌన్‌

Telugu Lo Computer
0


శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఆ దేశ ప్రభుత్వం పలువిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. చమురు నిల్వలు వేగంగా పడిపోతుండడంతో వాటిని ఆదా చేసేందుకు అత్యవసరం కానీ సేవలను సోమవారం నుంచి రెండు వారాలు నిలిపివేసింది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలు నామమాత్రపు సిబ్బందితో పని చేస్తున్నాయి. ఆస్పత్రులు, కొలంబో నౌకాశ్రయం మాత్రం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. పెట్రోల్ పంపుల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నాయి. మరోవైపు శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంపై ఆందోళనలు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. తాజాగా అక్కడ అధ్యక్ష సచివాలయ కీలక ద్వారాలను ఆందోళనకారులు చుట్టుముట్టారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్సా రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. ఏప్రిల్‌ 9వ తేదీ నుంచి ప్రధాన ద్వారాన్ని ఆందోళన కారులు దిగ్బంధించారు. తాజాగా రెండు ఎంట్రీపాయింట్లను కూడా వారు దిగ్బంధించారు. 'గొట గో గమ' నినాదాలతో చేపట్టిన ఆందోళన 73వ రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో పోలీసులు 21 మందిని అరెస్టు చేశారు. అధ్యక్షుడి కంటే పార్లమెంట్‌కు ఎక్కువ అధికారాలు ఉండేలా ప్రతిపాదిత 21 రాజ్యాంగ సవరణకు శ్రీలంక క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇది త్వరలో పార్లమెంట్‌ ముందుకు రానున్నదని మంత్రులు తెలిపారు. దేశ ప్రధాని రణిల్‌ విక్రమ సింఘే సోమవారం ఐఎంఎఫ్‌ బృందంతో చర్చలు జరిపారు. శ్రీలంక 70 ఏళ్ల చరిత్రలో తొలిసారి అత్యంతదారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 50 బిలియన్‌ డాలర్ల రుణ చెల్లింపుల తేదీలను పొడిగించాలని కోరుతోంది. ఈ పరిస్థితుల్లో శ్రీలంకకు అండగా భారత్‌ సాయం చేస్తోంది. ఈ క్రమంలో జులై నుంచి నాలుగు నెలల పాటు ఇంధన కొనుగోళ్లకు కూడా క్రెడిట్‌ లైన్‌ ఇచ్చేందుకు భారత్‌ సిద్ధమైందని లంక ప్రధాని విక్రమసింఘే ఇటీవల వెల్లడించారు. ఇప్పటికే భారత్‌ నుంచి 3,500 టన్నుల ఎల్‌పీజీ అక్కడకు చేరుకొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)