అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించం !

Telugu Lo Computer
0


త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తేలేదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అన్నారు. అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలంటూ దేశ వ్యాప్తంగా ఉద్యోగార్థులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో అజిత్ డోభాల్ ఈ విషయంపై స్పందించారు. భవిష్యత్తులో జరిగే యుద్ధాలకు అనుగుణంగా మన సైనిక వ్యవస్థలో మార్పులు చేసుకోవాలని చెప్పారు. భవిష్యత్తులో కాంటాక్ట్‌లెస్ యుద్ధాలు జరుగుతాయని, మన కంటికి కనపడని శత్రువుతో పోరాడాల్సి వస్తుందని తెలిపారు. దేశానికి చురుకైన, యువ శక్తితో కూడిన ఆర్మీ కావాలని ఆయన అన్నారు. సాంకేతిక కొత్త పుంతలు తొక్కుతోందని చెప్పారు. రేపటి కోసం మనం నేడు మారాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఎవ్వరికీ లేని యువశక్తి భారత్‌కు ఉందని అన్నారు. ప్రధాని మోదీ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ప్రాధాన్య అంశాల్లో జాతీయ భద్రత అంశం ఒకటిగా ఉందని తెలిపారు. దానికి ఎన్నో చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. రక్షణ రంగ సామగ్రి, వ్యవస్థ, సాంకేతికత, విధానాలు, నియామకాల్లో మార్పులు రావాలని అన్నారు. అగ్నివీర్‌లు కావాలనుకుంటున్నవారికి తానో సందేశం ఇస్తున్నానని ఆయన చెప్పారు. అగ్నివీర్‌లు కావాలనుకునేవారు సానుకల దృక్పథంతో ఉండాలని, దేశంపై, నాయకత్వంపై నమ్మకం ఉండాలని, అలాగే, ఆత్మవిశ్వాసం ఉండాలని ఆయన అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)