ఆగని 'అగ్నిపథ్‌' ఆందోళనలు

Telugu Lo Computer
0


కేంద్రప్రభుత్వం అమలుచేయనున్న 'అగ్నిపథ్‌'కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిరుద్యోగులు, యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఉత్తరాది రాష్ట్రాల్లో ఆందోళనలు ఉధృతంగా ఉండగా, రాష్ట్ర రాజధాని చెన్నైలోనూ నిరసన కార్యక్రమాలు చేస్తామని కొన్ని యువజన సంఘాలు ప్రకటించాయి. దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా అన్ని రైల్వే స్టేషన్ల వద్ద భద్రత పెంచారు. సెంట్రల్‌, ఎగ్మూర్‌, తాంబరం తదితర రైల్వేస్టేషన్ల వద్ద ఆదివారం సాయంత్రం నుంచే భద్రత కట్టుదిట్టం చేశారు. అగ్నిపథ్‌ ఆందోళనల కారణంగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చెన్నై డివిజన్‌లోని రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫారం టిక్కెట్ల విక్రయాన్ని నిలిపేసినట్లు దక్షిణరైల్వే సోమవారం ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ ఉత్తర్వులు అమలులో వుంటాయని పేర్కొంది. రైల్వే రక్షణా చర్యల్లో భాగంగా చేపట్టిన ఈ చర్యలకు ప్రయాణీకులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఇదిలా వుండగా రైల్వేస్టేషన్లలో ప్రయాణికులు మినహా ఇతరులను పోలీసులు బయటకు పంపేస్తున్నారు. టిక్కెట్లు ఉన్న వారిని మాత్రమే స్టేషన్లలోకి అనుమతిస్తున్నారు. ప్రయాణీకులు వెళ్లేందుకు, వచ్చేందుకు ఒక్కో మార్గం మినహా మిగిలినవి మూసివేశారు. ప్రయాణీకుల లగేజీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోనికి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో, లెనిన్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ నిర్వాహకుడు ఆంథోని దినకరన్‌ నేతృత్వంలో కార్యకర్తలు రాస్తారోకో చేపట్టేందుకు సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ రాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నుంగంబాక్కంలోని శాస్త్రిభవన్‌ వద్దకు ఊరేగింపుగా వచ్చిన కార్యకర్తలు లోనికి వెళ్లేందుకు యత్నించారు. అప్పటికే ప్రవేశద్వారం సమీపంలో బారికేడ్లు ఏర్పాటుచేసి భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అనంతరం కార్యకర్తలను పోలీసులు వ్యానులో ఎక్కించి అక్కడ నుంచి తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)