సిలిండర్ల ధర పెంపుదలపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు !

Telugu Lo Computer
0

 

వంట గ్యాస్ సిలిండర్ల ధర పెంపుదల పట్ల కాంగ్రెస్ నాయకుడు  రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్న ధరను, ఇప్పటి రేటును పోల్చారు. ఎల్పీజీ వంటగ్యాస్ ధర 2014లో 410 రూపాయలు ఉండగా.. ఇప్పుడు 999 రూపాయలకు చేరిందని గుర్తు చేశారు. రెండు గ్యాస్ సిలిండర్ల ధరకు ఇప్పుడు ఒక్కటే వస్తోందని విమర్శించారు. దేశంలో ఉన్న పేదలు, దిగువ మధ్య తరగతి కుటుంబీకులను ఆదుకునే శక్తి సామర్థ్యాలు, ఆ చిత్తశుధ్ది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తమ పార్టీ ఆర్థిక విధానాలకు ఆయా కుటుంబాల వారే ఆధారమని పేర్కొన్నారు. పేదలు, దిగువ, మధ్య తరగతి కుటుంబీకుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రభుత్వం ఆర్థిక విధానాలకు రూపకల్పన చేసిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు వారిపై ఆర్థిక భారాన్ని మోపేలా కేంద్రం చర్యలు తీసుకుంటోందని విమర్శించారు. మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి గృహావసర వంటగ్యాస్ సిలిండర్ల ధరలను పెంచిన వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారానికి దారితీసింది. పలు రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు ఆరంభం అయ్యాయి. పలుచోట్ల ప్రతిపక్ష పార్టీల నాయకులు రోడ్డెక్కారు. బైఠాయింపులు నిర్వహిస్తోన్నారు. ప్రభుత్వానికి నిరసనగా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్, ఇతర నిత్యావసరాల ధరల మంటతో సామాన్యలు ఇప్పటికే నానా ఇక్కట్లను ఎదుర్కొంటోన్నారు. అదే సమయంలో గృహావసరాల కోసం వినియోగించే ఎల్పీజీ సిలిండర్‌ ధరను 50 రూపాయలు పెంచడం మరింత భారాన్ని మోపినట్టయింది. ఏడు సంవత్సరాల వ్యవధిలో ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్ల ధరను కేంద్ర ప్రభుత్వం రెట్టింపు కంటే అధికంగా పెంచిందంటూ ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటోన్నాయి. అటు సోషల్ మీడియాలో దీనిపై విస్తృతంగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. #LPGCylinder, #Rs50 అనే హ్యాష్‌ట్యాగ్ వైరల్‌గా మారింది. ఈ హ్యాష్‌ట్యాగ్స్ మీద వేలకొద్దీ ట్వీట్లు పడుతున్నాయి. ప్రధాని మోడీపై మీమ్స్‌ను వదులుతున్నారు నెటిజన్లు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో స్మతి ఇరానీ చేసిన వ్యాఖ్యలు, ట్వీట్లను ఇప్పుడు తెర మీదికి తీసుకొస్తోన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)