అవసరమైతే బీఫ్ తింటా

Telugu Lo Computer
0


కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో బీఫ్ తినడంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య విమర్శలు చేశారు. తాను అవసరమైతే బీఫ్ తింటానని చెప్పారు. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీస్తున్నాయి. సోమవారం కర్ణాటకలోని తుమ్ముకూరు జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్‌పై విమర్శలు చేశారు. ''నేను హిందువును. ఇప్పటివరకు బీఫ్ తినలేదు. కానీ, అవసరమనుకుంటే బీఫ్ తింటాను. నన్ను ప్రశ్నించడానికి మీరెవరు? ఒక వర్గానికి చెందిన వాళ్లు మాత్రమే బీఫ్ తినరు. హిందువులు, క్రిస్టియన్లు కూడా బీఫ్ తింటారు. కర్ణాటక అసెంబ్లీలో కూడా ఒకసారి ఈ విషయం చెప్పాను. నన్ను తినొద్దని చెప్పడానికి మీరెవరు?'' అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. మతాల మధ్య ఆర్ఎస్ఎస్ చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తోందన్నారు. బీఫ్ తినడం ఆహారపు అలవాటు అని, ముస్లింలు మాత్రమే బీఫ్ తినరు అని అన్నారు. కర్ణాటకలో బీఫ్ తినడంపై గత జనవరి నుంచి బీజేపీ ప్రభుత్వం నిషేధం విధించింది. రాష్ట్రంలో గోమాంసం అమ్మడం, కొనడం, రవాణా చేయడం నిషేధం. గేదెలు, దూడలు, ఆవులు వంటివి రవాణా చేసినా, వధించినా, అమ్మినా చట్టప్రకారం నేరమే. ఇందుకు గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్షతోపాటు, యాభై వేల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు జరిమానా కూడా విధిస్తారు. అయితే, అనారోగ్యంతో ఉన్నవాటిని, 13 సంవత్సరాలు దాటిన వాటిని మాత్రమే చంపి తినేందుకు అనుమతి ఉంది. అది కూడా ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ సర్టిఫై చేసిన వాటిని, అనుమతించిన కేంద్రాల్లోనే వధించాలి.


Post a Comment

0Comments

Post a Comment (0)