పాటియాలా ఘర్షణల ప్రధాన నిందితుడు అరెస్ట్

Telugu Lo Computer
0


పంజాబ్‌లోని పాటియాలాలో శుక్రవారం జరిగిన ఘర్షణలకు సంబంధించి ప్రధాన నిందితుడు బర్జిందర్ సింగ్ పర్వానాను పోలీసులు ఆదివారం మొహాలీలో అరెస్ట్‌ చేసినట్లు పాటియాలా ఐజీ ముఖ్విందర్ సింగ్ చనియా మీడియాకు తెలిపారు. కోర్టులో ప్రవేశపెట్టి పోలీస్‌ రిమాండ్‌ కోరతామని చెప్పారు. జిల్లాలోని రాజపురాకు చెందిన బర్జిందర్ సింగ్ పర్వానా పాటియాలో శుక్రవారం జరిగిన ఘర్షణలకు కీలక సూత్రధారి అని తెలిపారు. హరీష్ సింగ్లా సహచరుడు శంకర్ భరద్వాజ్‌తోపాటు జగ్గీ పండిట్‌ను కూడా అరెస్టు చేసినట్లు వెల్లడించారు. శివసేనకు చెందిన పంజాబ్‌ విభాగం పంజాబ్‌ శివసేన (బాల్‌ ఠాక్రే) పాటియాలాలో శుక్రవారం యాంటీ ఖలిస్థాన్‌ మార్చ్‌ నిర్వహించింది. దీనికి వ్యతిరేకంగా కొందరు సిక్కులు, నిహాంగ్స్‌ మరో ర్యాలీ చేపట్టారు. నగరంలోని కాళీమాత ఆలయం వద్ద రెండు గ్రూపులు ఎదురెదురు పడటంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇరువర్గాలు రాళ్లు రువ్వడంతోపాటు కత్తులు దూసుకున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. ఘర్షణల నేపథ్యంలో శనివారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ విధించడంతోపాటు సాయంత్రం వరకు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)