ఏప్రిల్ నెలలో రూ.1.67 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు !

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్‌ నెలలో రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గతనెలలో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. ఈ మేరకు 2022 ఏప్రిల్ నెలలో రూ.1.67 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైందని కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది. ఇది జీవితకాల గరిష్ఠమని తెలిపింది. ఇదే ఏడాది మార్చిలో వసూలైన రూ.1.42 లక్షల కోట్లు రెండో అత్యధికమని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. మార్చితో పోల్చితే ఏప్రిల్‌లో రూ.25వేల కోట్లు అధికంగా జీఎస్టీ రాబడి వచ్చిందని వివరించింది. జీఎస్టీ వసూళ్లు 1.5 లక్షల కోట్ల మార్కును దాటడం ఇదే తొలిసారి. కాగా ఏప్రిల్ నెలలో వసూలైన జీఎస్టీ వసూళ్లలో సీజీఎస్టీ రూ.33,159 కోట్లుగా, ఎస్‌జీఎస్టీ రూ.41,793 కోట్లుగా, ఐజీఎస్టీ రూ.871,939 కోట్లుగా, సెస్ రూ.10,649 కోట్లుగా ఉంది. పన్ను చెల్లింపుదారులు సకాలంలో రిటర్నులను దాఖలు చేసేలా ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్‌లో పలు చర్యలు తీసుకోవడం, కంప్లియెన్స్‌లు సరళీకరించడం, పన్ను ఎగొట్టే వారిపై కఠిన చర్యలు, మెరుగుపడిన ఆర్థిక కార్యకలాపాల వల్ల జీఎస్టీ వసూళ్లు పెరిగినట్టు కేంద్రం అభిప్రాయపడింది. అటు ఏప్రిల్ నెలలో దిగుమతి చేసుకున్న వస్తువుల నుంచి 30 శాతం ఎక్కువ రెవెన్యూలను, దేశీయ లావాదేవీల నుంచి 17 శాతం ఎక్కువ కలెక్షన్లను కేంద్ర ప్రభుత్వం రాబట్టింది.

Post a Comment

0Comments

Post a Comment (0)