తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలెర్ట్ జారీ

Telugu Lo Computer
0


నైరుతి రుతుపవనాలు ఈసారి మూడు రోజుల ముందుగానే కేరళలో ప్రవేశించాయి. అరేబియా సముద్రంలో రుతుపవనాలు మరింత చురుకుగా కదులుతున్నాయి. కేరళతో పాటు తమిళనాడు, కర్ణాటకతో పాటు దక్షిణ, మధ్య బంగాళాఖాతంలో గాలులు వేగంగా వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అసని తుపాను కారణంగా నైరుతి రుతుపవనాల్లో వేగం పుంజుకున్నాయని వాతావరణ విశ్లేషకులు అంటున్నారు. సాధారణం కంటే చాలా ముందుగానే అంటే మే 16వ తేదీనే నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకాయని తెలిపారు. ఏపీ, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. నైరుతి రుతుపవనాల రాక ఫలితంగా ఏపీ, యానాం, తెలంగాణలో పలుచోట్ల నేడు సైతం మోస్తరు వర్షాలు కురయనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఓవైపు వర్షాలు, మరోవైపు తీవ్రమైన ఎండల నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కోస్తాంధ్ర జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. యానాంలోనూ నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంటుంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు వ్యాపిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో ప్రస్తుతం పడమర, వాయువ్య గాలులు వీస్తున్నాయి. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, పొట్టి శ్రీరాములు నెల్లూరులతో పాటు రాయలసీమ జిల్లాలైన ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. వేగంగా గాలులు వీచడంతో చెట్లు విరిగిపడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని, పొలం పనులు తాత్కాలికంగా విరమించుకోవడం ఉత్తమమని భారత వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, మహబూబ్‌నగర్, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, మరికొన్ని చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో వైపున తేమ అధికంగా ఉండటంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడతారు. రాష్ట్రంలో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి 10 నుంచి 20 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. హైదరాబాద్, పరిసర ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమై ఉన్నా వర్షం పడే అవకాశం లేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)