సుదీర్ఘ భూ వివాదం పై తీర్పు!

Telugu Lo Computer
0


1914లో బిహార్‌లోని భోజ్‌పుర్‌ జిల్లా, ఆరా సివిల్‌ కోర్టులో ఈ దావా దాఖలైంది. కోయిల్వార్‌ గ్రామంలో మూడెకరాల వివాదాస్పద భూమికి సంబంధించి యాజమాన్య హక్కుల కోసం రాజ్‌పూత్‌ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి దీన్ని వేశారు. ఎట్టకేలకు భోజ్‌పుర్‌ అదనపు జిల్లా జడ్జి స్వేతాసింగ్‌ మార్చి 11న ఈ కేసులో తీర్పు వెలువరించారు. కేసు వేసిన పార్టీకే ఈ భూమి చెందుతుందని అందులో పేర్కొన్నారు. బిహార్‌ రాజధాని పట్నాకు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఈ వివాదాస్పద స్థలం ఉంది. మున్సిపాలిటీగా మారిన ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఎకరం రూ.5 కోట్లు పలుకుతోంది. బ్రిటిష్‌ హయాంలో అజ్‌హర్‌ ఖాన్‌ అనే వ్యక్తికి కొయిల్వార్‌లో 9 ఎకరాల స్థలం ఉండేది. ఇందులో అతని వారసుల నుంచి సేకరించిన మూడు ఎకరాల స్థలం విషయమై రెండు రాజ్‌పుత్‌ కుటుంబాల మధ్య వివాదం నెలకొంది. రాజీ కుదుర్చుకునేందుకు ఉభయ పక్షాలు ససేమిరా అంగీకరించలేదు. దీంతో కేసు విచారణ శతాబ్దానికి పైగా సాగుతూ వచ్చింది. ఎన్నో విచారణల అనంతరం ఈ కేసు వేసిన దర్బారీసింగ్‌ ముని మనుమడు అతుల్‌ సింగ్‌ తదితరులకు అనుకూలంగా జడ్జి తీర్పు చెప్పారు. ''1914 నుంచి సుదీర్ఘకాలం విచారణ సాగడంతో రెండు కుటుంబాలు కొన్ని తరాల వారసులను కోల్పోయాయి. ఇప్పటికైనా ఈ వివాదానికి తెర దించాల్సిన అవసరముంది. అయినా, ఇది ఇక్కడితో ఆగుతుందని చెప్పలేం'' అని తీర్పు సందర్భంగా జడ్జి వ్యాఖ్యానించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)