అంబేడ్కర్‌ గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 3 May 2022

అంబేడ్కర్‌ గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య


ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తండ్యాంమెట్ట (మన్నెపేట)కు చెందిన దుంగ భూలోక, భారతిలు విశాఖలో వలస కూలీలుగా పనిచేస్తున్నారు. కుమారుడు నవీన్‌ ఓ షాపింగ్‌మాల్‌లో పనిచేస్తుండగా, కుమార్తె కరిష్మా (17) ఎచ్చెర్లలోని అంబేడ్కర్‌ గురుకులం (పాఠశాల/కళాశాల)లో ఇంటర్మీడియెట్‌ (బైపీసీ) ప్రథమ సంవత్సరం చదువుతోంది. చదువులో చురుగ్గా ఉండే కరిష్మా ఆరో తరగతి నుంచి ఇక్కడే చదువుతూ త్వరలో జరిగే పబ్లిక్‌ పరీక్షలతో పాటు నీట్, అగ్రికల్చర్‌ సెట్‌లకు సిద్ధమవుతోంది. ఇటీవలే చెవి నొప్పి అంటూ ఇంటికి వెళ్లి చికిత్స చేయించుకుని ఆదివారం మళ్లీ పాఠశాలకు చేరుకుంది. స్టడీ అవర్స్‌లో భాగంగా ఉదయం ఐదు గంటలకే నిద్ర లేచి 5.30 గంటలకు తరగతి గదికి చేరుకుంది. కొద్దిసేపటికే ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థినులు ఆరు గంటలకు తరగతి గదికి చేరుకోగా కరిష్మా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్‌ సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా ఎస్సై కె.రాము ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా విద్యార్థిని మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలం వద్ద ఆధారాలను క్లూస్‌ టీం సేకరించింది. విశాఖ నుంచి తల్లిదండ్రు లు, సోదరుడు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. తహశీల్దార్‌ సనపల సుధాసాగర్‌ గురుకులాన్ని పరిశీలించారు. గురుకులం పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు విజయనగరం నుంచి కారులో రాకపోకలు సాగిస్తున్నారు. కారు డ్రైవర్‌ ఈ విద్యార్థినిని కొంతకాలంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు సైతం చెప్పినట్లు తెలిసింది. అప్పట్లో తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థినికి ఉపాధ్యాయులు కౌన్సెలింగ్‌ ఇవ్వడం, డ్రైవర్‌ను ఉపాధ్యాయురాలు తొలగించడం జరిగాయి. ఈ క్రమంలోనే తోటి విద్యార్థులు కామెంట్లు చేయటం, విద్యార్థిని వ్యక్తిగతంగా రాస్తున్న డైరీ పరిశీలించి సోమవారం ఉపాధ్యాయురాలు మందలించటం వంటివి చోటుచేసుకున్నట్లు తెలిసింది. విద్యార్థిని ఆత్మహత్య విషయంలో గురుకుల యాజమాన్యం తీరుపై కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము రాకుండానే మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించటం, విద్యార్థుల తల్లిదండ్రులను సైతం అనుమతించని గురుకులంలోకి డ్రైవర్‌ను రానివ్వడం, గతంలో వివాదం తలెత్తినప్పుడు డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవటం వంటి అంశాలను లేవనెత్తుతున్నారు. పోలీసులు మాత్రం తాము వచ్చి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాకే మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించినట్లు చెబుతున్నారు. విద్యార్థిని రాసిన సూసైట్‌ నోట్‌ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. తల్లిదండ్రుల ఫిర్యాదు, పోలీసుల కేసు నమోదుకు భిన్నంగా నోట్‌ ఉండటం గమనార్హం. సూసైట్‌ నోట్‌ లో 'అమ్మా, నాన్నా, అన్నా.. నన్ను దయచేసి క్షమించండి. మిమ్మల్ని వదిలి వెళ్లటం బాధగా ఉంది. నాకు వేరే దారిలేదు. మీ నమ్మకాన్ని నిలబెట్టలేకపోయాను. దేవుడు ధృడమైన సంకల్పం ఇవ్వలేదు. నేను, డ్రైవర్‌ సాయి ఇద్దరం ఇష్టపడ్డాం. ఆయన నా వల్ల ఉద్యోగం కోల్పోయారు. నా మృతికి ఎవ్వరూ కారణం కాదు. రేపు అనేది ఎలా ఉంటుందో తెలియదు..' ఇదీ సూసైడ్‌ నోట్‌ సారాంశం. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గురుకులం ప్రిన్సిపాల్‌ కె.ఉషారాణి, ఇంగ్లీష్‌ టీచర్‌ భవానీ, ఈమె పూర్వపు కారు డ్రైవర్‌ సురేష్‌ (సాయి)పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.రాము చెప్పారు. శాఖాపరంగా సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీ చర్యలు చేపట్టారు. ప్రిన్సిపాల్‌ కె.ఉషారాణి, ఇంగ్లీష్‌ టీచర్‌ భవానీ, హౌస్‌ (క్లాస్‌ టీచర్‌) మంజులను సస్పెండ్‌ చేసినట్లు జిల్లా అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయాల సమన్వయకర్త యశోధలక్ష్మి తెలిపారు. ప్రస్తుత వైస్‌ ప్రిన్సిపాల్‌ రాధికకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు.

No comments:

Post a Comment