ముంబయిని కేంద్రపాలిత ప్రాంతం చేయడానికి కుట్ర

Telugu Lo Computer
0


మహారాష్ట్ర రాజధాని ముంబయిని కేంద్రపాలిత ప్రాంతం చేయడానికి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ కుట్రపడుతున్నారని శివసేన పార్టీ ఆరోపించింది. ముంబయిని రాష్ట్ర ప్రభుత్వ పరిధి నుంచి బయటకు తీసుకొచ్చేందుకు, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం కోసం ఒక ప్రణాళికను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఫడ్నవీస్‌ అందజేశారని శివసేన పేర్కొంది. పార్టీ అధికార పత్రిక సామ్నాలో ఈ మేరకు ఒక సంపాదకీయం ప్రచురించింది. 'ముంబయిని మహారాష్ట్ర నుంచి వేరు చేయాలనే కుట్ర నేటికీ పూర్తిగా ముగియలేదు. ముంబయికి జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యతను తగ్గించి, ఆ తర్వాత ముంబయిని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని చూస్తున్నారు. దీనిపై దేవేంద్ర ఫడ్నవీస్‌కి, మహారాష్ట్రలోని బిజెపి నాయకులందరికీ పూర్తి అవగాహన ఉంది' అని సంపాదకీయం పేర్కొంది. అలాగే, 'ఫడ్నవీస్‌ దీనిపై 'ప్రెజెంటేషన్‌'ని సిద్ధం చేశారు, ఇది ముంబయి మహారాష్ట్ర నుంచి ఎలా వేరు చేయవచ్చో చూపిస్తుంది.దీనిని హోం మంత్రిత్వ శాఖకు సమర్పించారు. ఒకవైపు మహారాష్ట్ర దినోత్సవాన్ని జరుపుకుంటూనే, మరోవైపు ముంబయిని మహారాష్ట్ర భౌగోళిక స్థితి నుంచి వేరు చేసే కుట్రలు బలోపేతం కావడం మంచిదికాదు' అని తెలిపింది. గత నెలలో ఇలాంటి ఆరోపణలు శివసేన ఎంపి సంజరు రౌత్‌ కూడా చేశారు. ముంబయిలో మరాఠీ ప్రజల సంఖ్య తగ్గిపోతుందని, కాబట్టి ముంబయిని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని బిజెపి నేతలు కోర్టుకు కూడా వెళతారని రౌత్‌ ఆరోపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)