ఏప్రిల్‌ నెలలో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం

Telugu Lo Computer
0


ఎండల ప్రభావంతో  ఏప్రిల్‌లో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. గతేడాది ఏప్రిల్‌తో పోల్చితే 13.6 శాతం మేర పెరుగుదలతో 132.98 బిలియన్ యూనిట్లకు చేరిందని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ  వెల్లడించింది. వేసవి ప్రభావం ముందుగానే మొదలవ్వడంతో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నాయని పేర్కొంది. గతేడాది ఏప్రిల్‌లో 117.08 బిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగిందని పోల్చింది. ఒకరోజు గరిష్ఠ విద్యుత్ వాడకం ఈ ఏడాది ఏప్రిల్‌లో 207.11 గిగా వాట్స్‌గా ఉంది. కాగా ఏప్రిల్ 2021లో ఇది 182.37 గిగావాట్లు.. ఏప్రిల్ 2020లో 132.73 గిగావాట్లుగా ఉందని వివరించింది. 2020లో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ కారణంగా విద్యుత్ వినియోగం పరిమితంగా ఉంది. కరోనాకు ముందు ఏడాది 2019 ఏప్రిల్‌లో 110.11 బిలియన్ యూనిట్లుగా ఉందని పేర్కొంది. విద్యుత్ డిమాండ్, వినియోగం పెరుగుదల రానున్న నెలల్లో ఆర్థిక వృద్ధిని తెలియజేస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనాకు సంబంధించిన ఆంక్షలన్నీ దాదాపు తొలగిపోవడంతో ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు జోరందుకోవడాన్ని సూచిస్తున్నాయని చెబుతున్నారు. మే నెలలో కూడా ఆర్థిక కార్యకలాపాలు భారీ స్థాయిలోనే కొనసాగుతాయని, విద్యుత్ వినియోగం కూడా అధికంగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ఎండాకాలం ముందుగానే మొదలయింది. ఈ ప్రభావంతో అనూహ్యంగా విద్యుత్ వినియోగం, డిమాండ్ రెండూ పెరిగాయి. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావంతో దేశంలో వాణిజ్య, పారిశ్రామిక రంగాల విద్యుత్ అవసరాలు పెరిగాయని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో కరోనా థర్డ్‌వేవ్ దేశంపై ప్రభావం చూపింది. దీంతో అనేక రాష్ట్రాలు స్థానికంగా ఆంక్షలు విధించడంతోపాటు వారాంతపు కర్ఫ్యూలు విధించాయి. బార్లు, రెస్టారెంట్లతోపాటు పలు వాణిజ్య సముదాయాలపై ఆంక్షలు విధించాయి. ఆ తర్వాత క్రమంగా ఆంక్షలను సడలించిన విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)