నిమ్మ ధర కిలో రూ.వంద నుంచి రూ.30కు పతనం

Telugu Lo Computer
0


నిమ్మ ధర కిలో రూ.30కు పతనం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పంట మార్కెట్‌కు వచ్చే సమయంలో వ్యాపారులంతా సిండికేట్‌గా మారి ధర తగ్గించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది దిగుబడి భారీగా తగ్గిపోయిందని, ధర సైతం తగ్గిపోవడంతో నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోందంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఏలూరు, దెందులూరు, గోపాలపురం, జంగారెడ్డిగూడెంలో నిమ్మ మార్కెట్లు ఉన్నాయి. సీజన్‌లో రోజుకు 200 లారీల వరకూ నిమ్మ ఎగుమతి జరుగుతుంది. ధర నిలకడగా ఉండడం లేదు. పంట మార్కెట్లోకి రానప్పుడు ధర ఎక్కువగా ఉంటోంది. పంట మార్కెట్‌కు వచ్చేసరికి వ్యాపారులు సిండికెట్‌గా ఏర్పడి ధర భారీగా తగ్గించేస్తున్నారు. ఎకరాకు వంద నుంచి 150 బస్తాల వరకూ నిమ్మ దిగుబడి వస్తుంది. 50 కిలోలను ఒక బస్తాగా పరిగణిస్తారు. అక్టోబర్‌, నవంబర్‌, మార్చి, ఏప్రిల్‌, మే నెలలు ఈ పంటకు సీజన్‌ సమయం. ఈ ఏడాది నిమ్మ తోటలకు తెగుళ్లు సోకడంతో కాపు తగ్గిపోయింది. ఎకరాకు 20 నుంచి 50 బస్తాలలోపే దిగుబడి వస్తోంది. నిమ్మతోటకు ఎకరం ఒక్కంటికీ ఏడాదికి రూ.50 వేల కౌలు చెల్లించవలసి ఉంటుంది. ఎకరాకు రూ.50 వేలు వరకూ పెట్టుబడి అవుతుంది. అంటే కౌలు రైతులకు దాదాపు రూ.లక్ష వరకూ ఖర్చవుతుంది. ఈ ఏడాది నిమ్మ దిగుబడి తగ్గినా మొదట్లో ధర బాగుండడంతో రైతులు ఆనందపడ్డారు. ప్రసుత్తం వారి ఆనందర ఆవిరైంది. ధర ఇంకా తగ్గిపోయే పరిస్థితి ఉందని రైతులు చెబుతున్నారు. దిగుబడి ఉంటే ప్రస్తుత ధరతో కొంతైనా బయట పడేవారు. దిగుబడి తగ్గడం, ధర తగ్గడంతో ఖర్చులు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని రైతులు తెలిపారు. కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)