ప్రధాని తో తెలంగాణ గవర్నర్ తమిళిసై భేటీ

Telugu Lo Computer
0


తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మోదీతో చర్చించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతోనూ భేటీ అవుతారని తెలుస్తోంది. దీని కోసం గవర్నర్‌ తమిళిసై పార్లమెంటుకు చేరుకున్నారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులను అమిత్‌ షాకు వివరించనున్నారు గవర్నర్. దీంతో పాటు గవర్నర్ ప్రోటోకాల్ ఉల్లంఘన, ఇతర అంశాలపైనా చర్చిస్తారని తెలుస్తోంది. గవర్నర్‌కు ఇవ్వాల్సిన కనీస ప్రొటోకాల్‌ను రాష్ట్ర ప్రభుత్వం పక్కనపెడుతోందంటూ రాజ్‌భవన్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్ర మంత్రి అమిత్‌షాకు గవర్నర్‌ తమిళిసై ఫిర్యాదు చేయనున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. వీటితో పాటు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్‌ కేంద్రానికి నివేదిక ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో ప్రముఖంగా కేసీఆర్‌ సర్కారు సహాయ నిరాకరణపైనే రిపోర్ట్‌ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షాను కలిసేందుకు గవర్నర్ తమిళిసై నిన్న రాత్రే ఢిల్లీ వెళ్లారు. కేంద్ర హోం శాఖ పిలుపు మేరకే తమిళిసై ఢిల్లీకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. అటు సీఎం కేసీఆర్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య దూరం పెరిగిన నేపథ్యంలో.. గవర్నర్ ఢిల్లీకి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మేడారం జాతర, యాదాద్రి, నల్లమలలో పర్యటనలో అధికారులు ప్రొటోకాల్‌ పాటించలేదనే విమర్శలున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై గవర్నర్‌ అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ ధాన్యాన్ని కేంద్రమే కొనాలంటూ టీఆర్‌ఎస్‌ డిమాండ్ చేస్తోంది. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సీఎం కేసీఆర్‌ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నెల 11న ఢిల్లీలో ధర్నాకు టీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ తమిళిసై.. ప్రధాని మోదీ, అమిత్‌షాతో భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)