దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ హైవే !

Telugu Lo Computer
0


ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ హైవే ఇండియాలో ఏర్పాటు కానున్న సంగతి తెలిసిందే. గత ఏడాది నవంబర్‌లో ప్రధాని మోదీ దీని గురించి ప్రకటించారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ ప్రాజెక్టు ఈ ఏడాది చివర లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు అటల్ హరిత్ విద్యుత్ రాష్ట్రీయ మహామార్గ్ (ఏహెచ్‌వీఆర్ఎమ్) అనే పేరు పెట్టారు. అయితే, ప్రారంభం నాటికి మరోపేరు పెట్టే అవకాశాలున్నాయి. యమునా ఎక్స్‌ప్రెస్ వే, ఢిల్లీ-జైపూర్ హైవేలను ఈ ప్రాజెక్టు కింద పూర్తిగా ఎలక్ట్రిక్ హైవేలుగా మారుస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎలక్ట్రిక్ హైవేగా నిలవనుంది. దీని పొడవు దాదాపు 500 కిలోమీటర్లు. ఎలక్ట్రిక్ వాహనాల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటయ్యే ఈ హైవేపై ప్రారంభంలోనే కనీసం 100 ఎలక్ట్రిక్ కార్లు, 25 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులో ఉంచుతారు. అవసరం అనుకున్న వాళ్లు ఎలక్ట్రిక్ కార్లను అద్దెకు తీసుకోవచ్చు. డ్రైవర్ కూడా అందుబాటులో ఉంటారు. ఈ హైవే పరిధిలో పన్నెండు చార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి. ఇందులో రెండు పూర్తిగా సోలార్ పవర్‌తోనే పనిచేస్తాయి. హైవేను మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ కూడా ఉంటుంది. వాహనాలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే సాయం అందే ఏర్పాట్లు చేస్తున్నారు. 45 నిమిషాల్లోపే సేవలు అందుతాయి. దేశంలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడి చార్జింగ్ స్టేషన్లలో పెట్టుబడి పెడితే, మూడేళ్లలోనే లాభాలు పొందవచ్చని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ హైవే జర్మనీలోని బెర్లిన్‌లో ఉంది. దీని పొడవు 109 కిలోమీటర్లు. మన దేశంలోని ప్రాజెక్టు పూర్తైతే ఇదే నెం.1 హైవేగా నిలుస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)