ప్రభుత్వ అతిథి గృహాల్లోనే బస !

Telugu Lo Computer
0


అధికారిక పర్యటనల సమయంలో హోటళ్లకు బదులుగా ప్రభుత్వ అతిథి గృహాల్లోనే బస చేయాలని, బంధువులను వ్యక్తిగత కార్యదర్శులుగా నియమించుకోవద్దని రాష్ట్ర మంత్రులను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. హోటళ్లకు బదులుగా ప్రభుత్వ అతిథి గృహాల్లోనే బస చేయాలనే నిబంధన ప్రభుత్వ అధికారులకు కూడా వర్తిస్తుందని యోగి చెప్పారు. అధికారులు సరైన సమయానికి విధులకు హాజరుకావాలని, భోజన సమయం 30 నిమిషాలకు మించకూడదని ఆదేశించారు. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయంలో భోజన విరామ సమయం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2.00 గంటల వరకు ఉంటుంది. విధులకు ఆలస్యంగా హాజరయ్యేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని యోగి హెచ్చరించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ ప్రామాణిక, నాణ్యమైన సేవలను సకాలంలో అందజేస్తామని తెలిపే సిటిజన్స్ చార్టర్‌ను అమలు చేస్తామన్నారు. కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఉదాసీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఫైలును సకాలంలో పరిష్కరించాలని, ఏ ఫైలునూ మూడు రోజులకు మించి పెండింగ్‌లో ఉంచడానికి వీల్లేదని చెప్పారు. జాప్యం జరిగితే అందుకు బాధ్యులను నిర్ణయించి, చర్యలు తీసుకుంటామన్నారు. అక్రెడిటేషన్ లేకుండా కళాశాలలను నిర్వహించడమంటే యువత భవిష్యత్తుతో ఆటలు ఆడుకోవడమేనని తెలిపారు. ఇటువంటి కళాశాలలపై ఫిర్యాదులు వచ్చినా, సమాచారం తెలిసినా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)