చైనాలో కఠిన లాక్ డౌన్

Telugu Lo Computer
0



చైనా రాజధాని షాంఘైలో కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. కరోనా కఠిన లాక్‌డౌన్‌తో జనం అల్లాడిపోతున్నారు. తినడానికి తిండి దొరకడం లేదని ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్నా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం చేస్తున్నారు. ఇక్కడ నిత్యం 20 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం గరిష్ఠంగా ఒక్కరోజే 25 వేల కేసులు రికార్డయ్యాయి. మార్చిలో కరోనా తీవ్రత పెరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షా 70 వేల కేసులు వెలుగుచూశాయి. కరోనా కట్టడిలో భాగంగా ఏప్రిల్‌ 1 నుంచి షాంఘై మహా నగరంలో లాక్‌డౌన్‌ విధిస్తున్నారు. మొదట 5 రోజులే లాక్‌డౌన్‌ విధిస్తామన్న అధికారులు..వైరస్‌ ఉద్ధృతి తగ్గకపోవడంతో దాన్ని కంటిన్యూ చేశారు. దాంతో ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. ఓవైపు ఇళ్లకే పరిమితం కావడం, మరోవైపు నిత్యవసరాల కొరతతో షాంఘై వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వృద్ధులకు ఔషధాలు పొందడం కూడా ఇబ్బందిగా మారింది. ఇలా కనీసం తిండి కూడా దొరకడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న షాంఘై పౌరులు భవనాల కిటికీలు, బాల్కనీల్లోకి వచ్చి పెద్దగా అరుస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఆహారం, నిత్యవసరాలను స్థానిక అధికారులు పంపిణీ చేస్తున్నా వాటి కొరత వేధిస్తోంది. సూపర్‌ మార్కెట్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడమే కాకుండా వాటిని లూటీ చేసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు షాంఘై వాసుల ఆకలి కేకలపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలా చేయడం వల్ల వైరస్‌ మరింత వ్యాపిస్తుందని చెబుతున్నారు. దీంతో డ్రోన్లను రంగంలోకి దింపిన అధికారులు.. కోరికలను నియంత్రించుకోండి. పాటలు పాడడానికి కిటికీలు తెరవొద్దని హెచ్చరికలు చేస్తున్నారు. మరో వైపు వైద్య సిబ్బంది కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఓ కొవిడ్‌ ఐసోలేషన్‌లో వైద్యుడు కుప్పుకూలిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఐసోలేషన్‌ కేంద్రాల్లోనే వారికి చికిత్స అందిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. మొత్తంగా కరోనా మహమ్మారి చైనాల్లో కల్లోలం సృష్టిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)