ఎండల నుంచి త్వరలో ఉపశమనం

Telugu Lo Computer
0


దేశమంతటా రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 45 డిగ్రీలకు పైగానే టెంపరేచర్స్ రికార్డవుతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం నుంచే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం అయ్యే వరకు మాడు పగిలేంత ఎండలు ఉంటున్నాయి. దీంతో ఎండ నుంచి తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నారు. మే 4వ తేదీ నాటికి అండమాన్ సముద్రంలో తుపాన్ ఏర్పడే అవకాశం ఉందని దీని కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతాయని ఐఎండి అంచనా వేసింది. మే 4 నాటికి తుపాన్ గా మారి, మే 5వ తేదీ నాటికి అల్పపీడనంగా మారుతుందని ఐఎండి వెల్లడించింది. ఉష్ణోగ్రతల్లో తగ్గుదలకు కారణమయ్యే అవకాశం ఉందని ఐఎండి సీనియర్ శాస్త్రవేత్త ఆర్.కే. జెనామణి తెలిపారు. ఏప్రిల్ 29వ తేదీ నుంచి 30, మే 01 తేదీ వరకు పశ్చిమ రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ యూపీ, జార్ఖండ్ లలో ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగిందన్నారు. మే 02వ తేదీ నుంచి మార్పులు సంభవిస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపారు. మరోవైపు.. భారతదేశంలో ఎండలతో పాటు వడగాలులు వీస్తున్నాయని, రానున్న 24 గంటల నుంచి 48 గంటల పాటు వడగాలులు కొనసాగుతాయన్నారు. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉన్నట్లు, తూర్పు భారతదేశంలోని ఒడిశా, బీహార్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయన్నారు. ఝార్సుగూడ, బలంగీర్, సంబల్ పూర్ తో పాటు కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందన్నారు. శనివారం నుంచి ఇక్కడ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతాయన్నారు. ఢిల్లీలో 0.5 నుంచి 01 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని 46 డిగ్రీల వరకు తాకొచ్చన్నారు. హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు. రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో మే 02వ తేదీ నుంచి మే 04వ తేదీ వరకు ఉరుములతో కూడి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ తేదీల్లో టెంపరేచర్స్ 36 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)